-

అసభ్యంగా ప్రవర్తించిన ఎక్సైజ్‌ హెడ్‌కానిస్టేబుల్‌  

28 Aug, 2018 11:26 IST|Sakshi
ఖమ్మంలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట భద్రం దంపతులు.. 

ఖమ్మం ఎక్సైజ్‌ స్టేషన్‌–2లో ఘటన

స్టేషన్‌లో మందు పార్టీ.. హెడ్‌ కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

ఖమ్మంక్రైం : మద్యం మత్తులో ఓ ఎక్సైజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఒక మహిళ పట్ల ఆమె భర్త ఎదుటే అసభ్యంగా ప్రవర్తించాడు. అడ్డుకోబోయిన భర్తను కొట్లాడు. అంతేకాక విధి నిర్వహణలో ఉన్న సదరు హెడ్‌కానిస్టేబుల్‌ మరో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో కలిసి ఏకంగా స్టేషన్లోనే మద్యం సేవించాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలోని ఎక్సైజ్‌ స్టేషన్‌లో సోమవారం చోటు చేసుకొంది. బాధితుల కథనం ప్రకారం.. పంపింగ్‌ వెల్‌ రోడ్‌ ప్రాంతానికి చెందిన భద్రం ఇంటి వద్ద బెల్ట్‌షాపు నడుపుతుంటాడు. ఆదివారం రాత్రి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బెల్ట్‌షాపుపై దాడిచేసి భద్రం, అతడి భార్యను, దొరికిన మద్యాన్ని రాపర్తినగర్‌లోని ఎక్సైజ్‌ స్టేషన్‌ –2లో అప్పగించారు. అక్కడి ఎక్సైజ్‌ అధికారులు..  ఎవరైనా సొంత పూచీకత్తు ఇస్తే వారిని వదిలిపెట్టాలని స్టేషన్‌ వాచర్‌గా ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ నరేందర్‌కు అప్పగించారు.

ఆ తర్వాత నరేందర్, మరో ఇద్దరు ప్రైవేటు  వ్యక్తులతో కలిసి స్టేషన్‌లోనే మద్యం సేవించాడు. అర్ధరాత్రి కావటంతో తమను వదిలిపెట్టాలని భద్రం నరేందర్‌ను కోరగా, వదిలిపేట్టే ప్రసక్తే లేదని చెప్పాడు. దీంతో ఎక్సైజ్‌ ఎస్‌ఐకి భద్రం ఫోన్‌చేసి చెప్పగా ఎస్‌ఐ హెడ్‌కానిస్టేబుల్‌కు ఫోన్‌ చేశారు.  అయినా నరేందర్‌ వారిని వదిలిపెట్టలేదు. కొద్దిసేపటి తర్వాత మద్యం మత్తులో ఉన్న నరేందర్‌ భద్రం భార్య పట్ల అసభ్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడాడు. అడ్డు వచ్చిన భద్రంపై దాడి చేశాడు. ‘సార్‌.. నా భార్యను ఏమీ అనొద్దు’ అని భద్రం బతిమాలినా వినకుండా వీరంగం సృష్టించాడు. కాసేపటి తర్వాత నరేందర్, అతడి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులు బయటకు వెళ్లగా..  భద్రం, అతడి భార్య స్టేషన్‌నుంచి బయటపడి టూటౌన్‌ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

హెడ్‌కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌..  

విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ విధి నిర్వహణలో ఉన్నప్పుడే స్టేషన్‌లో మద్యం సేవించటంతో విచారణ అనంతరం సస్పెండ్‌ చేసినట్లు ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ సోమిరెడ్డి తెలిపారు. అయితే బెల్ట్‌ షాపు నిర్వాహకుల పట్ల నరేందర్‌ అనుచితంగా ప్రవర్తించలేదని,  వారు కేవలం అతనిపై అభియోగం మోపారని చెప్పారు. ఎక్సైజ్‌ శాఖలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  బెల్ట్‌షాపు నడుపుతూ కల్తీ మద్యం అమ్ముతున్న భద్రం, అతడి భార్యపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. 

ఎక్సైజ్‌ స్టేషన్‌–2 రూటే సపరేటు.. 

ఖమ్మంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎక్సైజ్‌ స్టేషన్‌–2 రూటే సపరేటు అని తెలుస్తోంది. కనీసం అక్కడ సిబ్బందిపై స్టేషన్‌ అధికారులకు అజమాయిషీ ఉండదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎవరికి వారే యమునాతీరే అన్న చందం గా పనిచేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి. నగరంలో అత్యధికంగా బెల్ట్‌ షాపులు ఈ స్టేషన్‌ పరిధిలోనే నడుస్తున్నా పట్టించుకోనే దిక్కులేదని, సిబ్బంది మామూళ్ల మత్తులో మునిగి తేలుతుంటారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏకంగా సిబ్బంది స్టేషన్‌లోనే మందు పార్టీలు చేస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు