విప్ ఇంట్లో...కానిస్టేబుల్ ఆత్మహత్య

15 May, 2016 00:40 IST|Sakshi
విప్ ఇంట్లో...కానిస్టేబుల్ ఆత్మహత్య

సర్వీసు రైఫిల్‌తో పొట్టలో కాల్చుకున్న గంగాధర్
 
 మందమర్రి రూరల్/మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు నివాసంలో విధులు నిర్వహిస్తున్న ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సర్వీస్ రైఫిల్ (ఎస్‌ఎల్‌ఆర్)తో పొట్టలో కాల్చుకొని మృతిచెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని బెల్లంపల్లి బెటాలియన్‌కు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బొండాజీ గంగాధర్ (47) శుక్రవారమే ఓదేలుకు ఎస్కార్ట్‌గా విధుల్లో చేరాడు. ఓదేలు శనివారం మధ్యాహ్నం తన నివాసంలో టీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఒక్కసారిగా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది.

దాంతో ఓదేలుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి చూడగా గంగాధర్ తుపాకీతో పొట్టలో కాల్చుకుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కన్పించాడు. ఆయన్ను హుటాహుటిన ఆర్కేపీ సింగరేణి ఏరియూ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. గంగాధర్ ఆత్మహత్య బాధాకరమని ఎస్పీ తరుణ్ జోషి అన్నారు. గంగాధర్ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం అస్టా గ్రామానికి చెందిన గంగాధర్ కుటుంబ సమస్యలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్నాడని వివరించారు.

ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడని, ఈ బాధలు పడలేకనే ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ ఆత్మహత్య విచారకరమని ఓదేలు పేర్కొన్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. ఆత్మస్థైర్యంతో ఉండాలని ఆయన కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారాన్ని త్వరగా ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు.

మరిన్ని వార్తలు