కరోనాతో కానిస్టేబుల్‌ మృతి

22 May, 2020 02:47 IST|Sakshi

చికిత్స పొందుతూ కుల్సుంపుర ఠాణా కానిస్టేబుల్‌ దయాకర్‌రెడ్డి మృతి

సొంతూరు ప్రజలు కాదనడంతో సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు

తీవ్ర జ్వరం ఉన్నా కరోనా లక్షణాలు లేవన్నారు: మృతుని సోదరుడు  

మన్సూరాబాద్‌: కరోనా నియంత్రణ కోసం శ్రమిస్తున్న పోలీసు శాఖలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. కరోనా బారినపడిన కొందరు పోలీసులు చికిత్స అనంతరం కోలుకోగా కుల్సుంపురా పోలీసు కానిస్టేబుల్‌ దయాకర్‌రెడ్డి (33) మాత్రం చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో పోలీసు శాఖలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ మామిళ్లగూడేనికి చెందిన దయాకర్‌రెడ్డి హైదరాబాద్‌ మన్సూరాబాద్‌ డివిజన్‌లోని ఓ కాలనీలో నివాసముంటూ హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని కుల్సుంపుర పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

ఆయనకు భార్య శైలజ (29)తోపాటు ఏడేళ్ల కుమారుడు, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చిలో భార్య, పిల్లలను సొంతూరికి పంపిన దయాకర్‌రెడ్డి... నెల రోజులపాటు టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడ్డాడు. చికిత్స అనంతరం కోలుకొని విధులకు హాజరవుతున్నాడు. సొంతూరిలో ఉన్న భార్య పిల్లలను ఈ నెల 11న నగరానికి తీసుకొచ్చాడు. 13న తోటి కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకుని కరోనా పరీక్షలకు వెళ్లాడు. 15న పాజిటివ్‌గా రిపోర్టు రావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాడు. బుధవారం రాత్రి 9.30 గంటలకు మృతిచెందినట్లు ఆస్పత్రి వర్గాలు నిర్ధారించాయి. అయితే దయాకర్‌రెడ్డి ఆదివారం రాత్రి బ్రెయిన్‌ ట్యూమర్‌తో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం.

సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు...
దయాకర్‌రెడ్డి మృతదేహానికి సొంతూరు మామిళ్లగూడెం తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. దీంతో మృతుడి తల్లిదండ్రులను నగరానికి రప్పించి వారి సమక్షంలో సాహెబ్‌నగర్‌ శ్మశానవాటికలో గురువారం తెల్లవారుజామున అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు హాజరై తిరిగి క్వారంటైన్‌ జోన్‌లో ఉన్న నివాసానికి వచ్చిన మృతుడి తల్లిదండ్రులు, అత్తమామలు, మరదలిని కరోనా పరీక్షల కోసం అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇది ప్రభుత్వ హత్యే: మృతుని సోదరుడు
తీవ్ర జ్వరంతో వారం రోజులుగా కింగ్‌కోఠి, సరోజినీ ఆస్పత్రుల చుట్టూ తిరిగిన దయాకర్‌రెడ్డికి కరోనా లక్షణాలు లేవని ఆస్పత్రి వర్గాలు తెలిపాయని మృతుని సోదరుడు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. కరోనా పరీక్షలు నిర్వహించాలని పలుమార్లు వైద్యులను కోరినా నిర్వహించలేదని, ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యమే తన సోదరుని మృతికి కారణమైందన్నాడు. సోదరునికి సకాలంలో వైద్యం అందించి ఉంటే బ్రతికేవాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని దుయ్యబట్టారు.

అధిక డ్యూటీ భారం వల్లే...
గతంలో టైఫాయిడ్‌తో ఇబ్బంది పడి సెలవులు వాడుకోవడం, కరోనా సమయంలో సెలవులు పెట్టుకోవడానికి వీల్లేకపోవడం, సమయానికి తిండి, నిద్ర లేకపోవడంతోనే కానిస్టేబుల్‌ దయాకర్‌రెడ్డికి రోగ నిరోధకశక్తి తగ్గి కరోనా బారినపడ్డాడని స్థానికులు పేర్కొన్నారు.

కానిస్టేబుల్‌ దయాకర్‌రెడ్డి మృతికి డీజీపీ సంతాపం
కరోనా చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన పోలీస్‌ కానిస్టేబుల్‌ దయాకర్‌రెడ్డి మృతికి డీజీపీ మహేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. దయాకర్‌రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తామని గురువారం ట్విట్టర్‌ ద్వారా డీజీపీ వెల్లడించారు. కానిస్టేబుల్‌ మృతికి నెటిజన్లు కూడా ట్వీట్ల ద్వారా సంతాపం ప్రకటించారు. ప్రాణాలు అర్పించిన అమర సైనికుడు అంటూ కీర్తించారు. దయాకర్‌రెడ్డి పిల్లలకు స్కూలు విద్య అందించేందుకు సిద్ధమని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునితా క్రిష్ణన్‌ ముందుకు వచ్చారు. కానిస్టేబుల్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపీరెడ్డి గురువారం డీజీపీ మహేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

మరిన్ని వార్తలు