అవకాశాలను అందిపుచ్చుకోవాలి

15 May, 2018 09:13 IST|Sakshi
అభ్యర్థులచే ప్రతిజ్ఞ చేయిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు 

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

గజ్వేల్‌లో కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ ప్రారంభం

హాజరైన కలెక్టర్, సీపీ, కార్పొరేషన్‌ చైర్మన్లు, గడా ప్రత్యేకాధికారి

గజ్వేల్‌/గజ్వేల్‌రూరల్‌: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని దొంతుల ప్రసాద్‌ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన కానిస్టేబుల్‌ ఉచిత శిక్షణ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

అనంతరం కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. గజ్వేల్‌లో శిక్షణ పొందుతున్న 750 మంది అభ్యర్థుల్లో 400 మందికి పైగా ఉద్యోగం సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. రోజుకు 18 గంటల పాటు కష్టపడి చదివి సివిల్స్‌ స్టేట్‌ ర్యాంకు సాధించానని గుర్తుచేశారు. జిల్లాలో 1906 మంది శిక్షణ పొందుతుండగా వారిలో 1200 మంది ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నామన్నారు.

ముంపు గ్రామాల విద్యార్థులకు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు హామీ మేరకు ఎంట్రెన్స్‌ పరీక్ష లేకుండా ఈ శిక్షణకు ఎంపిక చేశామన్నారు. శిక్షణ పొందే వారికి అన్ని వసతులతో పాటు భోజనం అందిస్తున్నామని చెప్పారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఉన్నత చదువులు అభ్యసించిన వారికి హైదరాబాద్‌లో మరో 45 రోజుల పాటు శిక్షణ అందిస్తామన్నారు. అనంతరం పోలీస్‌ కమీషనర్‌ జోయల్‌ డేవిస్‌ మాట్లాడుతూ.. 21 వేల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయన్నారు.

ఇక్కడ 70 రోజుల పాటు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 750 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని, 15 రోజులకోసారి అధికారులచే మోటివేషన్‌ తరగతులు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి మాట్లాడుతూ.. ముందు గ్రామాల విద్యార్థులు ఉద్యోగాలు పొంది రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

గడా ప్రత్యేకాధికారి హన్మంతరావు మాట్లాడుతూ.. శిక్షణ పొందే అభ్యర్థులకు బాలుర, బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌లలోని వసతి గృహాల్లో వసతి ఏర్పాటుచేస్తామన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్డీసీ చైర్మన్‌ తూంకుంట నర్సారెడ్డి, అదనపు డీసీపీ నర్సింహారెడ్డి, ఇన్‌చార్జి ఏసీపీ మహేందర్, శిక్షకులు భాగ్యకిరణ్, గజ్వేల్‌ ఆర్డీఓ విజయేందర్‌రెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్, వైస్‌చైర్మన్‌ దుంబాల అరుణ తదితరులు పాల్గొన్నారు. 

ఏనాడైనా రైతుల గురించి ఆలోచించారా? 

గజ్వేల్‌: ‘రైతుబంధు’ పథకంపై కాంగ్రెస్‌ నేతల విమర్శలు సిగ్గుచేటని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ములుగులోని అటవీశాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల గురించి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలు ఓట్ల కోసమే ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ మడుపు భూంరెడ్డి, గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గాడిపల్లి భాస్కర్‌ తదితరులున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా