గిరిజన యువకులపై కానిస్టేబుళ్ల ప్రతాపం

17 Oct, 2014 02:09 IST|Sakshi

ఒకరి పరిస్థితి విషమం.. పోలీసులకు ఫిర్యాదు
ఎల్లారెడ్డిపేట : సారా పట్టివేత పేరుతో ఎక్సైజ్ కానిస్టేబుళ్లు మితి మీరి ప్రవర్తిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఇద్దరు గిరిజన యువకులపై కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేశారు. ఇందులో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. బాధితులు, కుటుంబ సభ్యుల కథనం... ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం తండాకు చెందిన భూక్య నర్సింలు(22) ఆయన మిత్రుడు లకావత్ మణిరాం ద్విచక్ర వాహనంపై గురువారం తెల్లవారుజామున కరీంనగర్ ఆసుపత్రికి బయలుదేరారు. ఎల్లారెడ్డిపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాటు వేసి ఉన్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు శ్రావణ్, ప్రశాంత్‌రెడ్డిలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నర్సింలు, మణిరాంలను ఆపారు. వాహనంలో సారాను తరలిస్తున్నారా అని ఆరాతీశారు. తాము కరీంనగర్ వెళ్తున్నామని ఎంత చెప్పిన వినని కానిస్టేబుళ్లు కర్రలతో దాడిచేశారు. ఈ సంఘటనలో నర్సింలు కంటికింది భాగంలో ఎముకలు విరిగాయి.

మణిరాం స్వల్పంగా గాయపడ్డాడు. నర్సింలు సృహతప్పి పడిపోవడంతో ఆందోళన చెందిన కానిస్టేబుళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మణిరాం గ్రామస్తులకు సమాచారం అందించడంతో గాయపడ్డ నర్సింలును మొదట సిరిసిల్ల ఏరియాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నర్సింలు వెంటిలెటర్‌పై చికిత్స పొందుతున్నాడు. బతకడం కష్టమని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి నర్సింలు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. దాడి సంఘటనపై నర్సింలు తండ్రి లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎసై రమేశ్ తెలిపారు.

మరిన్ని వార్తలు