అసెంబ్లీ సమావేశాలకు ‘పంచాయతీ’ పీటముడి

7 Dec, 2017 04:05 IST|Sakshi

ఇంకా సిద్ధం కాని ముసాయిదా బిల్లు

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు పంచాయతీరాజ్‌ చట్టంతో పీటముడి పడింది. ఈ నెల మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని సీఎం కేసీఆర్‌ గత నెల 17న అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇప్పటికీ పంచాయతీరాజ్‌ ముసాయిదా బిల్లు సిద్ధం కాలేదు. ప్రస్తుత పంచాయతీరాజ్‌ చట్టానికి సవరణలు చేసి కొత్తగా తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం–2017 అమల్లోకి తీసుకురావాలని సీఎం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఈ ముసాయిదా బిల్లు తయారీకి ప్రభుత్వం ఇటీవల కమిటీని నియమించింది. పంచాయతీరాజ్‌ చట్టం 73, 74వ రాజ్యాంగ సవరణతో ముడిపడి ఉన్నది కావటంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముందస్తుగా కేంద్రం అనుమతి పొందాల్సి ఉంటుందని న్యాయ శాఖ ఇప్పటికే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు 250 పేజీల ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీరాజ్‌ అధికారులు చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే 130 పేజీల వరకు కసరత్తు పూర్తయింది. వేగంగా కసరత్తు చేసినా మరో పది రోజులు పడుతుందని చెబుతున్నారు.

ఇక కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రాలు రూపొందించుకునే ఏ చట్టానికైనా రాష్టపతి అనుమతి తప్పనిసరి. బిల్లును అసెంబ్లీలో పెట్టేందుకు కేంద్రం అనుమతి కావాలి. ఇప్పటికిప్పుడు అనుమతి కోరినా.. కేంద్రం అంగీకరించేందుకు 15 రోజుల సమయం పడుతుందని సమాచారం. దీంతో ఈ నెలాఖరులోగా పంచాయతీరాజ్‌ బిల్లు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీని సమావేశపరిచే అవకాశాల్లేవని తెలుస్తోంది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టాక రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. కేంద్ర చట్టానికి లోబడి రాష్ట్ర బిల్లు లేకుంటే కేంద్రం తమ అభ్యంతరాలను తెలియజేసే అవకాశాలుంటాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా