విభజనకు పదేళ్లు

9 Nov, 2018 10:26 IST|Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా దశాబ్దకాలం అయ్యింది. 2008లో పార్లమెంటు ఆమోదించగా.. 2009 ఎన్నికల సందర్భంగా మారిన నియోజకవర్గాల హద్దులతో పలువరి నే‘తలరాతలు’ కూడా మారాయి. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. పాత 13 నియోజకవర్గాల్లో ఏడు పాతవి ఉండగా... మరో ఆరింటిని మార్పు చేసి కొత్తవి ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది.
 

కోరుట్ల: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా పదేళ్లు అవుతోంది. మారిన సెగ్మెంట్ల హద్దులతో నేతల తలరాతలు మారిపోయాయి. కొంత మంది నేతలు కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీ నియోజకవర్గాలకు మారిపోవాల్సి వచ్చింది. నియోజవర్గాల రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరికి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. విభజన ఫలితంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అంతకుముందున్న 13నియోజకవర్గాల్లో ఆరు సెగ్మెంట్లు  కనుమరుగయ్యాయి. ఆ స్థానంలో మరో ఆరు కొత్తవి అవిర్భవించాయి. ఏడు పాతవే ఉన్నాయి. మొత్తం మీద నియోజకవర్గాల పునర్విభజన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయ సమీకరణాల్లో పెద్ద ఎత్తున మార్పులు.. చేర్పులకు తావిచ్చింది. 

2008లో విభజనకు ఆమోదం..
 

2001 జనాభా లెక్కల ఆధారంగా అప్పటికి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2002లో రిటైర్డు సుప్రీం కోర్టు జడ్జి కుల్దీప్‌సింగ్‌ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. 2004–05 సంవత్సరాల్లో ఈ కమిటీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించింది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల మార్పులు.. పరిపాలన సౌలభ్యత.. ప్రజల అనుకూలత వంటి అన్ని అంశాలపై కూలకుశంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. 2006లో హైదరాబాద్‌లో నియోజకవర్గాల పునర్విభజన కమిటీ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన వినతులు..అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ 2007సంవత్సరంలో తాము రూపొందించిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. కమిటీ సిపార్సులకు 2008 ఫిబ్రవరిలో రాష్ట్రపతి ప్రతిభా భారతి ఆమోద ముద్ర వేశారు. ఆ తరువాత వచ్చిన 2009అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహించారు. 

ఆరు నియోజకర్గాలు కనుమరుగు 
 

నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడిన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతంలో ఉన్న ఆరు సెగ్మెంట్లు కనుమరుగయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులు మారడంతో ఆయా సెగ్మెంట్లలో చేరిన కొత్త మండలాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా పాత్రిపదికన రిజర్వేషన్లు మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కేవలం ఒక ఎస్సీ(మేడారం), ఒక ఎస్టీ(నేరెళ్ల)అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండగా ఆ తరువాత కొత్తగా మూడు ఎస్సీ నియోజకవర్గాలు చొప్పదండి, ధర్మపురి, మానకొండూరు ఏర్పాటయ్యాయి. విభజనలో మెట్‌పల్లి, మేడారం, నేరెళ్ల, కమలాపూర్, బుగ్గారం, ఇందుర్తి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో కోరుట్ల, రామగుండం, వేములవాడ, ధర్మపురి, మానకొండూర్, హుస్నాబాద్‌ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. 

మారిన నే‘తలరాతలు’
 

నియోజకవర్గాల పునర్విజనతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కొందరి నేతల రాతలు తారుమారయ్యాయి. సెగ్మెంట్ల మార్పుతో పాటు గతంలో ఉన్న మండలాల్లోనూ మార్పులు జరగడంతో కొంత మంది నాయకులు తమ పట్టును కోల్పోగా.. మరికొంత మందికి కలిసొచ్చింది. బుగ్గారం, మెట్‌పల్లి నియోజకవర్గాలు కలిసిపోయి కోరుట్ల ఏర్పాటు కావడం మెట్‌పల్లి ప్రాంత నేతలకు కలిసొచ్చింది. బుగ్గారంకు చెందిన నాయకులు ఉనికి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమలాపూర్, ఇందుర్తి, నేరెళ్ల ప్రాంతాలకు చెందిన నేతలు కొంతమంది పట్టు ఉన్న ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గతంలో మెట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న మేడిపల్లి, కథలాపూర్‌ మండలాలు వేములవాడలో కలియడంతో ఆ ప్రాంతంలోని నేతలకు ఇప్పటికీ ఇక్కడ పూర్తిస్థాయిలో పట్టు దొరకడం లేదు. పెద్దపల్లి, మేడారం నియోజవర్గం పరిధిలోనూ కొంతమంది నేతలకు వలసల ఇబ్బంది తప్పలేదు. పాత మేడారం నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కొంత మంది ధర్మపురి, చొప్పదండి సెగ్మెంట్లలో పాగా వేశారు. ఇలా సెగ్మెంట్ల పునర్విభజన ఉమ్మడి జిల్లాలోని నేతలపైన ప్రభావం చూపడమే కాకుండా రాజకీయ సమీకరణాల్లో ఎన్నో మార్పులకు తావిచ్చింది. 

2009కు ముందు నియోజకవర్గాలు    

బుగ్గారం          
మెట్‌పల్లి          
జగిత్యాల          
మేడారం          
హుజూరాబాద్‌      
కమలాపూర్‌      
కరీంనగర్‌   
మంథని          
నేరెల్ల(ఎస్టీ)          
సిరిసిల్ల          
ఇందుర్తి          
చొప్పదండి      
పెద్దపల్లి 

2009తరువాత నియోజకవర్గాలు

కరీంనగర్‌ 
మానకొండూర్‌(ఎస్సీ) 
హుజూరాబాద్‌ 
హుస్నాబాద్‌ 
చొప్పదండి(ఎస్సీ) 
వేములవాడ 
సిరిసిల్ల కోరుట్ల 
జగిత్యాల 
ధర్మపురి(ఎస్సీ) 
పెద్దపల్లి 
రామగుండం 
మంథని   

మరిన్ని వార్తలు