‘పాలమూరు’ను నిర్మించి తీరుతాం

12 Jul, 2015 00:19 IST|Sakshi

షాద్‌నగర్ రూరల్: సీమాంధ్ర నాయకులు ఎన్నికుట్రలు, కుతంత్రాలు పన్నినా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టంచేశారు. ఉమ్మడిరాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతపెట్టుదారులు, బడాబాబుల పెత్తనం కొనసాగడంతో తెలంగాణప్రాంతం ఎక్కువగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం షాద్‌నగర్ పట్టణంలోని గణేష్ గార్డెన్స్‌లో టీవీవీ శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు.
 
 అంతకుముందు సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణ పూర్తిగా వెనకబడిపోయిందన్నారు. జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే తాగు, సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. పథకం పూర్తికి పార్టీలకతీతంగా తెలంగాణ నాయకులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాసంఘాలు, నేతలు కలిసికట్టుగా ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు.
 
 కృష్ణాజలాల్లో వాటా సాధిస్తాం
 జిల్లాప్రజలు వలసలతో జీవనం గడుపుతున్నారని, వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీవీవీ స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలని, వ్యవసాయరంగానికి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించాలన్నారు. కృష్ణాజలాల్లో వాటా సాధించి తీరుతామన్నారు. ప్రాజెక్టులను సీమాంధ్ర నాయకులు అడ్డుకోవాలని చూడటం సరికాదన్నారు. షాద్‌నగర్ ప్రాంతంలో అనేక పరిశ్రమలున్నా ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి దొరకడంలేదన్నారు. కార్యక్రమంలో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవిందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయకుమార్, కోశాధికారి టీజీ శ్రీనివాస్, సతీష్‌రెడ్డి, లక్ష్మినాయక్, రాజారాం, రవింద్‌గౌడ్, కృష్ణబగాడే, నర్సింహా, చంద్రశేఖర్, నర్సింలు, ప్రశాంత్, కిష్టప్ప, శ్రీహరి పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు