కాసుల వర్షం

8 Jul, 2019 12:09 IST|Sakshi
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అటవీ భూ భాగంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌

‘క్యాంపా’ కింద జిల్లా అటవీశాఖకు భారీగా నిధులు.. 

మూడేళ్లుగా అటవీ విస్తరణకు రూ.20 కోట్లు విడుదల

ప్రాజెక్ట్‌ నిర్మాణాల్లో 3,517 ఎకరాల అటవీ భూమి సేకరణ

760 ఎకరాల రెవెన్యూ భూమి అటవీశాఖకు అప్పగింత

సాక్షి, సిద్దిపేటజోన్‌: మూడేళ్లుగా అటవీశాఖలో కాసుల వర్షం కురుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా 3,517 ఎకరాల అటవీ భూమిని అధికారులు సేకరించారు. దీనికి బదులుగా జిల్లాలోని 760 ఎకరాల రెవెన్యూ భూమి అటవీశాఖకు అప్పగించారు. ప్రాజెక్ట్‌కు సేకరించిన భూమికి పరిహారం కింద  జిల్లా అటవీశాఖకు రూ.149 కోట్లు డిపాజిట్‌ చేశారు. దీనిలో  క్యాంపా(కంపెన్షనరీ అప్రిసియేషన్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ప్లానింగ్‌ అథారిటీ) కింద  విడతల వారీగా  రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసింది.  ఈ నిధులతో  అటవీ సంరక్షణ, విస్తరణ చేయనున్నారు. అలాగే జిల్లాలో 3.50 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 

జిల్లాలోని 23 మండలాల పరిధిలో ఆటవీశాఖ రికార్డుల ప్రకారం 27,604 హెక్టార్ల  అటవీ విస్తరించి ఉంది.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రిజర్వాయర్‌ల  నిర్మాణంతో పాటు కాలువల కోసం జిల్లాకు చెందిన పలు ప్రాంతాల్లో అటవీశాఖకు చెందిన భూమిని సైతం సేకరించారు. దీంతో  కేంద్ర అటవీ శాఖ నిబంధనల ప్రకారం ప్రాజెక్టులు, రైల్వేలైన్‌లు,  జాతీయ రహదారులతో పాటు ప్రజా 
ప్రయోజనాల నిమిత్తం అటవీ భూమిని  తీసుకోవడం వల్ల కోల్పోయిన  భూమికి సమానంగా  రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ భూమిని కాని, అది లేని పక్షంలో  ఆ భూమికి సంబంధించిన విలువ మేరకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 

క్యాంపా  పథకం కింద అటవీ శాఖకు రెండు మార్గాల్లో  నిధులు సమకూరుతున్నాయి. వాటిలో ఒకటి నెట్‌ ప్రజెంట్‌ వాల్యూ(ఎన్‌పీవీ) ద్వారా,  ఆటవీ భూభాగంలో  కోల్పోయిన  అటవీ స్థలం విలువతో పాటు  అడవుల్లోని చెట్లకు కూడా  విలువ కట్టి పరిహారంగా  చెల్లించాల్సి ఉంటుంది.  క్యాంపాలో రెండో విభాగంలో కంపెన్షనరీ అప్రియేషన్‌ (సీఏ) కింద  జిల్లాలో నిర్మిస్తున్న నీటి  ప్రాజెక్టుల కోసం అటవీభూమిని  స్వీకరిస్తే  పరిహారంగా  ఎకరానికి  ఎకరం చొప్పున రెవిన్యూ భూమిని గాని, లేని పక్షంలో పరిహారంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం  అటవీశాఖకు  చెందిన 3,517  ఎకరాల భూమిని  ఈ ప్రాజెక్టు నిమిత్తం సేకరించారు.  

దీనికి  ప్రత్యమ్నాయంగా  రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 760 ఎకరాల రెవెన్యూ భూమిని  అటవీ విస్తరణ కోసం కేటాయించింది. మిగతా భూమికి  విలువ కట్టి  మూడేళ్లుగా దశల వారీగా ప్రభుత్వం అటవీశాఖకు క్యాంపా పద్దు కింద  నిధులను కేటాయించింది. ఈ లెక్కన 2016–17 సంవత్సరంలో రూ. 6.35 కోట్ల ప్రతిపాదనలకు గాను ప్రభుత్వం రూ. 4.19 కోట్లను మంజూరి చేసింది.  రెండో విడత 2017–18 సంవత్సరానికి సంబంధించి  రూ. 5కోట్ల  పరిహార ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం రూ. 3కోట్లు మంజూరి చేసింది.  అలాగే 2018–19 సంవత్సరానికి  సంబంధించి క్యాంపా పద్దు కింద రూ.13.29 కోట్ల  ప్రతిపాదనలకు గాను ప్రభుత్వం రూ.9.38 కోట్లను మంజూరి చేసింది.  ఈ ఏడాది 2019–20 సంవత్సరానికి  సంబంధించి అటవీశాఖ జిల్లాలో కాళేశ్వరం  ప్రాజెక్టు నిర్మాణంలో ఆటవీ భూమిని కోల్పోయిన  పరిహారం కోసం రూ. 20 కోట్లతో పరిహారం కోసం ప్రతిపాదనలు పంపగా రూ. 2.50 కోట్లను విడుదల చేయడం విశేషం. 

రెవెన్యూ భూమి అప్పగింత
క్యాంపా నిధులను  అటవీ విస్తీర్ణం, సంరక్షణ, అభివృద్ధి కోసం కేటాయిస్తారు.  అటవీ భూమిని  కోల్పోయిన జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంగా 706 ఎకరాల రెవెన్యూ భూమిని  అప్పగించింది. ఈ భూమిలో  అటవీశాఖ గతేడాది 200 ఎకరాల్లో పెద్ద ఎత్తున  ప్లానిటేషన్‌  ప్రక్రియను చేపట్టి కోల్పోయిన అటవీ విస్తీర్ణాన్ని  పెంచే దిశగా చర్యలు చేపట్టింది. మరోవైపు  సుమారు 6,700 ఎకరాల్లో  మొక్కలు నాటే  కార్యక్రమాన్ని చేపట్టింది.

జిల్లాకు మంజూరైన క్యాంపా నిధులతో ప్లానిటేషన్, కందకాల తవ్వకం, దట్టమైన అటవీ ప్రాంతం కలిగిన శనిగరం, చికోడు మల్లన్నగుట్టలు, అల్లీపూర్‌ గుట్టలు, గజ్వేల్, హుస్నాబాద్, ములుగుతో పాటు  మర్పడగ ప్రాంతాల్లో  అడవిలోని జీవాల కోసం నీటి  తోట్లు(సాసర్‌పీట్‌లు) నిర్మాణం చేపట్టింది. నర్సంపల్లి  అటవీ ప్రాంతం చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి నిధులను వినియోగించారు. శనిగరం, గండిపల్లి, కేశావపూర్, మీర్జాపూర్, గిరాయిపల్లి, శనిగరం లాంటి ప్రాంతాల్లో మరింత అటవి విస్తీర్ణం కోసం ప్లానిటేషన్‌ ప్రక్రియను పెద్ద ఎత్తున క్యాంపా నిధుల ద్వారా చేపడుతున్నారు. 

అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం
కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణంలో రిజర్వాయర్‌ల కోసం 3,517 ఎకరాల అటవీ భూమిని ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 706 ఎకరాల రెవెన్యూ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు అప్పగించింది. మిగిలిన భూమికి పరిహారంగా క్యాంపా పథకం కింద నిధులు దశల వారిగా వస్తున్నాయి. ఈ  క్యాంపా నిధులతో జిల్లాలో కోల్పోయిన అటవీ ని తిరిగి విస్తరించేందుకు  ప్రణాళికలు రూ పొందించాం. ఇప్పటికే పలు చోట్ల  ప్రభుత్వం ఇచ్చిన రెవెన్యూ భూమిలో 3.5 కోట్ల మొక్కలను ప్లానిటేషన్‌కింద అభివృద్ధి చేస్తున్నాం.

                                                                                                                      –శ్రీధర్‌రావు, జిల్లా ఆటవీశాఖ అధికారి  

మరిన్ని వార్తలు