కంది ఐఐటీహెచ్‌లో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన

30 Apr, 2020 11:11 IST|Sakshi
ఆందోళన వ్యక్తం చేస్తున్న వలస కార్మికులు

 జీతాలు ఇవ్వడం లేదని, స్వస్థలాలకు పంపడంలేదని

ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధులపై కన్నెర్ర  

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులపై రాళ్ల వర్షం

నాలుగు గంటల పాటు నాటకీయ పరిణామాలు

కలెక్టర్, ఎస్పీ చొరవతో సద్దుమణిగిన వివాదం

సాక్షి, సంగారెడ్డి/ టౌన్‌/రూరల్‌ : లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న కందిలోని ఐఐటీహెచ్‌ (ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌) పరిసరాలు బుధవారం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. నిత్యం విద్యార్థులు, పరిశోధకులతో కళకళలాడే పరిసరాలు బుధవారం భవన నిర్మాణ కార్మికుల ఆందోళనతో ఒక్కసారిగా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. సుమారు నాలుగు గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఎక్కడి నుంచి రాళ్లు ఎవరిమీద పడతాయో అర్థంకాని పరిస్థితి. చివరకు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సుమారుగా 200 మంది పోలీసు బలగాలతో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.. కలెక్టర్‌ హనుమంతరావు జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపడంతో గొడవ సద్దుమణిగింది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడకు చేరుకొని కార్మికులతో స్వయంగా మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని నచ్చజెప్పారు.(కరోనా.. కోతలు)

కంది ఐఐటీహెచ్‌ క్యాంపస్‌ విస్తరణలో భాగంగా రెండో దశ భవన నిర్మాణ పనులు సంవత్సర కాలంగా కొనసాగుతున్నాయి. ఇందుకు వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులను నెలసరి వేతనం ఇస్తూ పనులు చేయిస్తున్నారు. వీరికి మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని, భోజనం కూడా సరిగా పెట్టడం లేదని కార్మికులు ఆందోళన చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు లేకుండా గుంపులుగా ఆందోళనకు దిగడంతో పోలీసులు సైతం నిర్ఘాంతపోయారు. ఒక దశలో రాళ్లు రువ్వడంతో స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. కార్మికులు ఒకవైపు, పోలీసులు మరో వైపు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాళ్ల దాడిలో ఏఎస్‌ఐ సంఘమేశ్వర్, ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.  అనంతరం కలెక్టర్, ఎల్‌అండ్‌టీ ఉన్నతాధికారులతో జరిపిన చర్చల్లో తమకు వచ్చిన వేతనంలో కొంత తమ కుటుంబాలకు పంపితేనే అక్కడ పూట గడుస్తుందని, అందువల్ల వేతనాలు ఇప్పించాలని కార్మిక ప్రతినిధులు కలెక్టర్‌కు విన్నవించారు.  

కార్మికులను ఆదుకోండి
వలస కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఐఐటీహెచ్‌లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు మంచిగా ఉండి పనిచేసుకోవాలి. లాక్‌డౌన్‌ ముగిసిన పరిస్థితిని బట్టి స్వస్థలాలకు వెళ్లవచ్చునన్నారు. తిరిగి ప్రారంభించే నిర్మాణ పనుల్లో పాల్గొనాలి.  – జగ్గారెడ్డి, ఎమ్మెల్యే  

నిరంతరం పర్యవేక్షిస్తాం
ఐఐటీహెచ్‌లో గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. పనిలేక, జీతాలు లేక, స్వస్థలాలకు వెళ్లాలన్న కోరికతో ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తరువాత కలెక్టర్‌ హనుమంతరావు, నేను.. కార్మికులు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో మాట్లాడాం. పోలీసు బలగాలను ఐఐటీహెచ్‌ వద్ద మోహరించాం. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తాం.  – చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్పీ

అన్ని వసతులు కల్పిస్తాం
వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు తీసుకుంటున్నాం. సంస్థ ఆధ్వర్యంలో పనిచేసే కూలీలు, కార్మికులకు వారే అండగా ఉండాలి. ఐఐటీహెచ్‌ భవన నిర్మాణ కార్మికులను ఎల్‌అండ్‌టీ, షాపూర్‌జీ సంస్థలే అన్ని వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. జీఎస్టీ వల్ల జీతంలో కోత విధిస్తున్నారని కార్మికులు చెప్పారు. అలా కాకుండా పూర్తి జీతం ఇవ్వాలని ఆదేశించాం. వారికి పెండింగ్‌ వేతనాలు గురువారం లోగా అందిస్తారు. అదే విధంగా తాజా కూరగాయలను పంపిస్తున్నాం. భోజన వసతి కూడా ఏర్పాటు చేయిస్తాం. లాక్‌డౌన్‌ సమయంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి మాత్రం ప్రభుత్వం అనుమతిలేదు. అందువల్ల వారు ఇక్కడే ఉండాలి. స్వస్థలాలకు వెళ్లినా క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తుందన్న విషయాన్ని కార్మికులు గ్రహించాలని హితవు పలికారు.  – హనుమంతరావు, కలెక్టర్‌

మరిన్ని వార్తలు