చెరువులో నిర్మాణాలు!

19 Apr, 2019 08:42 IST|Sakshi
చెరువు ఎఫ్‌టీఎల్‌ స్థలంలో వెలిసిన నిర్మాణాలు...

కబ్జాదారుల గుప్పిట్లో కోమటికుంట

కాలువలు, తూములు తొలగించి పనులు

అక్రమార్కులకు వరంగా అధికారుల సమన్వయలోపం

స్థానికులు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం

రాజేంద్రనగర్‌ :  దశాబ్దాల కాలంపాటు సాగు, తాగునీరందించిన చెరువు ఇప్పుడు కబ్జాలతో కుచించుకుపోతోంది. చెరువులోకి వరదనీరు రాకుండా కాలువలను దారి మళ్లించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమన్వయలోపంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. పీరం చెరువు ప్రాంతంలోని సర్వేనెంబర్‌ 27లో 4.25 ఎకరాల విస్తీర్ణంలో కోమటికుంట చెరువు విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుతో పాటు ఎఫ్‌టీఎల్‌ను నిర్థారించి హద్దులను ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతమంతా పచ్చటి పొలాలతో కళకళలాడేది. చెరువు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు ఈ నీరే ఉపయోగపడేది. ఈ చెరువులోనే వర్షాకాలంలో ఎగువ ప్రాంతం నుంచి నీరు చేరేది. సంవత్సరం పొడవునా నీటితో వెంకన్నకుంట కళకళలాడేది. చుట్టుపక్కల వారు తాగేందుకు దీని నీటిని ఉపయోగించేవారు. అయితే, ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారి నిర్మాణాలు వెలిశాయి.

దీంతో ఈ ప్రాంతంలో భూమికి విలువ పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో గజం స్థలం రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు పలుకుతోంది. ఈ చెరువులోకి కొందరు వర్షపు నీరు రాకుండా కాలువలను మూసివేశారు. తమ పంట పొలాలను ప్లాట్లుగా చేసిన సమయంలో చెరువుకు వచ్చే కాలువలు, తూములను తొలగించి నిర్మాణాలు చేపట్టారు. దీంతో ప్రస్తుతం వరదనీరు చేరడం లేదు. చెరువు భూమిని కబ్జా చేసేందుకు కొందరు ముందస్తు ప్రణాళికతో నిర్మాణాలను ప్రారంభించారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నామంటూ.. ఎఫ్‌టీఎల్‌ భూముల్లో మొదటగా నిర్మాణాలు పూర్తి చేశారు. దీనిని ఇరిగేషన్‌ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు ప్రశ్నించకపోవడంతో ఏకంగా చెరువు స్థలంలోనే నిర్మాణాలు వెలిశాయి. కొన్ని రోజులుగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో అదనుగా భావించి జోరుగా నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై స్థానికులు ఫిర్యాదు చేసినా పని ఒత్తిడిలో అధికారులు చర్యలు చేపట్టలేదు. ఇదే అదునుగా భావించి కబ్జాదారులు ప్రçహారీ నిర్మాణాలను చేపడుతున్నారు. స్థానికంగా ఈ చెరువును ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా నిధులు కేటాయించింది. రూ.3 లక్షలతో చెరువు కట్ట ఎత్తును పెంచారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులను నిర్వహించాల్సి ఉండగా.. నిర్మాణాలు జరుగుతుండడంతో ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కబ్జాదారులకు పనులు మరింత సులభం అయ్యాయి. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు స్పందించి చెరువు స్థలాన్ని కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు