కంటెయినర్‌ ఇళ్లొచ్చాయ్‌!

14 Sep, 2019 02:54 IST|Sakshi

సకల హంగులతో నిర్మాణం

ఒకచోటు నుంచి మరో చోటుకు సులువుగా తరలింపు

మొయినాబాద్‌(చేవెళ్ల)/కందుకూరు: చూడముచ్చటైన సోఫాలతో హాల్, అబ్బురపరిచే కిచెన్, బెడ్రూమ్‌లు, ఔరా అనిపించే ఇంటీరియర్‌. ఇది చాలా ఇళ్లలో ఉంటుంది కదా అని అనుకుంటున్నారా?. కానీ ఈ ఇళ్లు మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకునిపోవచ్చు. కొద్దిరోజులు విహారయాత్రలకు వెళ్లినా వీటిని మనతోనే తీసుకెళ్లొచ్చు. ఇవే కంటెయినర్‌ ఇళ్లు. ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో వీటి నిర్మాణంవైపు ప్రజలు అడుగులు వేస్తున్నారు. ట్రెండ్‌కు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం ఇలా మారుతోంది. కొన్నిచోట్ల ఆఫీసులుగా మారుతున్నాయి. బయటకు సాధారణంగానే కనిపించినా.. లోపల మాత్రం సకల హంగులు ఉంటున్నాయి. 

సులభంగా తరలింపు...
రియల్టర్లు, డెవలపర్లు, బిల్డర్లు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో తాత్కాలికంగా ఓ షెడ్‌ ఉండాలని భావిస్తున్నారు. చిన్న గది కట్టాలన్నా ఇటుకలు, ఇసుక, సిమెంటు, రేకులు తదితర సామగ్రి కావాలి. పని పూర్తయిన తరువాత దానిని కూల్చి వేయాల్సిందే.  వీటికి ప్రత్యామ్నాయంగా కంటెయినర్లలో ఆఫీసులు ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిని సులభంగా తరలించే అవకాశం ఉండటంతో కూడా ఎక్కుమంది మొగ్గు చూపుతున్నారు.  

చదరపు అడుగుకు రూ.1,200... 
20 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో ప్రారంభించి 30/10, 40/10, 40/20, 40/8 ఇలా పలు కొలతల్లో కంటెయినర్‌ ఇళ్లు, కార్యాలయాలను తయారు చేసి ఇస్తున్నారు. ఇంటీరియర్‌ డిజైన్లతో పాటు విద్యుత్, ఫ్యాబ్రికేషన్‌ తదితరాలను, ఫర్నిచర్, టాయిలెట్స్‌ సమకూర్చి అందజేస్తున్నారు. ఒక చదరపు అడుగు విస్తీర్ణం సుమారుగా రూ.1,200–1,500 వరకు ఖర్చవుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. 20/10 కంటెయినర్‌ ఇల్లు ఏర్పాటుకు రూ.1.85–2.40 లక్షల వరకు ఖర్చవుతుంది. దీంతోపాటు టాయిలెట్, ఫర్నిచర్‌కు అదనంగా మరో రూ.60 వేలు వరకు తీసుకుంటున్నారు. 40/10 కంటెయినర్‌ దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు కానుంది. కంటెయినర్‌ను బట్టి దాని జీవితకాలం 20–30 ఏళ్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. కంటెయినర్‌ ఇళ్లు, ఆఫీసులను శంషాబాద్‌ సమీపంలోని ఓఆర్‌ఆర్‌ పక్కన, నగరంలోని జీడిమెట్లలో తయారు చేసి విక్రయిస్తున్నారు.

ఆసక్తిని బట్టి తయారీ
వినియోగదారుడి ఆసక్తి మేరకు వివిధ రకాల సైజుల్లో కంటెయినర్లను తయారు చేసి ఇస్తున్నాం. ఫాంహౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లతో పాటు ప్రాజెక్టుల వద్ద అవసరమైన ఆఫీస్‌ రూమ్‌లు, లేబర్‌ క్వార్టర్స్, టాయిలెట్లు, బాత్‌రూమ్‌లు తదితరాలను నిర్మించి ఇస్తున్నాం. సాధారణంగా మెటల్‌ మందం 1.2 మి.మీ., లోపల ఇన్సూలేషన్‌ 50 మి.మీ.తో ఇస్తాం. మందం పెరిగితే ధర పెరుగుతుంది. కంటెయినర్‌లో ఏర్పాటు చేసుకునే వసతుల్ని బట్టి ధర మారుతుంటుంది. ఆర్డర్‌ ఇచ్చిన వారం పది రోజుల్లో సరఫరా చేస్తాం. 
    – కృష్ణంరాజు సాగి, నిర్వాహకుడు, ఆర్‌ఈఎఫ్‌ టెక్నాలజీస్, జీడిమెట్ల      

మరిన్ని వార్తలు