మంచిర్యాల కలెక్టర్‌కు ధిక్కార నోటీసులు

21 Mar, 2017 03:22 IST|Sakshi

స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌కు హైకోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కారం కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని ఆయనను ఆదేశించింది. దీనిపై స్వయంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని చెప్పింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కెయిత్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అదనంగా సేకరించిన తమ భూమికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరుతూ పెట్టుకున్న వినతిపత్రంపై త్వరగా నిర్ణయం తీసుకునేలా కలెక్టర్‌ను ఆదేశించాలని కోరుతూ కాశీపేట మండలం, కోమటిచేను గ్రామానికి చెందిన బి.లక్ష్మి, మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి, పిటిషనర్ల వినతిపత్రంపై చట్ట ప్రకారం నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ జిల్లా కలెక్టర్‌పై లక్ష్మి కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ సురేశ్‌ కెయిత్‌.. కలెక్టర్‌ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. ఎందుకు ధిక్కార చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ కలెక్టర్‌ కర్ణన్‌కు నోటీసులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు