పులి కదలికలపై నిరంతర నిఘా

19 Feb, 2020 08:56 IST|Sakshi
 పులి సంచరించే అవకాశం ఉన్న ప్రదేశాలను సిబ్బందికి చూపుతున్న రేంజ్‌ అధికారి అప్పయ్య

నిత్యం పరిశీలిస్తున్న అధికారులు

పులి, ప్రజల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

తాంసి(కె), గోల్లఘాట్‌ గ్రామాలలో 4 బేస్‌క్యాంపులు

అందుబాటులో వన్యప్రాణుల సంరక్షణ వాహనం

సాక్షి, తాంసి(ఆదిలాబాద్‌) : భీంపూర్‌ మండలంలోని తాంసి(కె), గోల్లఘాట్‌ పరిసర ప్రాంతాలలో పశువులపై పులి తరుచూ దాడులు చేస్తూ హత మార్చుతుండడంతో అటవీశాఖ సిబ్బంది తాంసి(కె), గోల్లఘాట్‌ గ్రామాలలో పులి కదలికలపై నిరంతర నిఘా పెట్టింది. పులి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. సోమవారం అటవీశాఖ కన్జర్వేటర్‌ వినోద్‌ కుమార్‌ తాంసి(కె) గ్రామాన్ని సందర్శించి పులి సంచారం ఉన్న ప్రదేశాలను పరిశీలించి, గ్రామస్తులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజలు, పులుల రక్షణకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామంలో ప్రజలకు, పులులకు ఎటువంటి నష్టం జరుగుకుండా సిబ్బందికి పలు సూచనలు చేశారు. మంగళవారం ఎఫ్‌ఆర్‌వో అప్పయ్య ఆధ్వర్యంలో తాంసి(కె), గోల్లఘాట్‌ గ్రామాలలో 4 బేస్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు.

సంరక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు..
తాంసి(కె) గ్రామంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌లో ఆదిలాబాద్‌ రేంజ్‌ అటవీశాఖ అధికారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అడవి చిత్రపటం ద్వారా బీట్‌ అధికారులకు అవగాహన కల్పించారు. పెన్‌ గంగ పరివాహక ప్రాంతంలో పులి కదలికలను అటవీశాఖ సిబ్బంది పరిశీలించడానికి పెన్‌గంగ నది ఒడ్డున 15 ఫీట్ల ఎత్తుపై ప్రత్యేకంగా మంచెను ఏర్పాటు చేశారు. పులి కదలికలను పరిశీలించడానికి అటవీశాఖ ప్రత్యేకంగా మానిటరింగ్‌ అధికారిని ఏర్పాటు చేసింది. తాంసి(కె) గ్రామంలో మంగళవారం డివిజనల్‌ అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, రేంజ్‌ ఆఫీసర్‌ అప్పయ్య సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో పులి కదలికల కోసం పరిశీలించారు.

మరిన్ని వార్తలు