పండుగ జేస్కోవాలంటే పైసలేవీ!

14 Oct, 2018 01:23 IST|Sakshi

     వైద్య, ఆరోగ్యశాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వెతలు 

     మూడు నెలలుగా వేతనాలివ్వని కాంట్రాక్టర్లు 

     సమ్మెకు దిగిన సిబ్బంది..

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం.. మరోవైపు ఇంటికొచ్చిన ఆడబిడ్డలను ఆదరించేదెట్లా అనే ఆందోళన. కొత్త బట్టల సంగతేమోగాని పండుగపూట కనీస మర్యాదలు కూడా చేయలేని పరిస్థితి. ఇదీ వైద్య, ఆరోగ్య శాఖలోని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల దుస్థితి. కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ యాజమాన్యం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. కీలకమైన ఓపీ సమయంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులంతా విధులు బహిష్కరించి ధర్నాకు దిగుతుండటంతో ఓపీ సేవలే కాకుండా పలు సర్జరీలు సైతం వాయిదా పడుతున్నాయి. 

ఇంటి అద్దెలు.. కిరాణాషాపుల్లో బకాయిలు 
ప్రతిష్టాత్మక గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సులు, పారామెడికల్‌ స్టాఫ్, ఫోర్త్‌క్లాస్‌ ఎంప్లాయీస్‌ 470 మంది పని చేస్తున్నారు.  నీలోఫర్‌ చిన్న పిల్లల ఆస్పత్రిలో 120 మంది నర్సులు, పారామెడికల్‌ స్టాఫ్, ఫోర్త్‌క్లాస్‌ ఎంప్లాయీస్‌ పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పటికే మూడు నెలల నుంచి వేతనాలు లేక ఇంటి అద్దెలు, కిరాణా షాపుల్లో పెట్టిన బాకీలు భారీగా పెరిగిపోయాయని, పాత బాకీ చెల్లిస్తే కానీ వారు కూడా కిరాణం ఇవ్వడం లేదంటున్నారు.  

ప్రభుత్వం ఇచ్చినా.. ఇవ్వకపోయినా... 
నిబంధనల ప్రకారం ప్రభుత్వం బడ్జెట్‌ మంజూరు చేసినా.. చేయకపోయినా కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఏజెన్సీ నిర్వాహకులే ప్రతినెలా విధిగా ఆయా సిబ్బంది వేతనాలు చెల్లించాలి. కానీ, ఏజెన్సీ నిర్వాహకులు మూడునెలలుగా వేతనాలివ్వడం లేదు. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ కింద పని చేస్తున్న ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటే నెలకు కనీసం రూ.70లక్షలపైనే అవుతుంది. ఇంత పెద్ద మొత్తాన్ని తాము మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలమని ఏజెన్సీల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.  

ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలతో డీఎంఈ చర్చలు 
ఔట్‌ సోర్సింగ్‌ వైద్య సిబ్బంది ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం ఇటీవల ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలతో చర్చలు జరిపింది. ఏజెన్సీలకు బకాయి పడిన దాంట్లో కొంత మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించడమే కాకుండా రూ.4 కోట్లకు సంబంధించిన రిలీజింగ్‌ ఆర్డర్‌ కూడా ఇచ్చిందని, దసరా పండగ లోపే ఆయా కార్మికులందరికీ వేతనాలు అందజేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి చెప్పారు. 

మరిన్ని వార్తలు