వలస కార్మికుల హక్కుల కోసం ఒప్పందాలు

31 Jan, 2015 03:12 IST|Sakshi
వలస కార్మికుల హక్కుల కోసం ఒప్పందాలు
  • కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
  • సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో పనిచేసే భార త వలస కార్మికుల హక్కుల పరిరక్షణలో భాగంగా వివిధ దేశాలతో ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను కుదుర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ ఒప్పందాల వల్ల తాము పనిచేసే దేశాల్లో సామాజిక భద్రత చెల్లింపుల నుంచి వారికి మినహాయింపు లభిస్తుందన్నారు.

    ఇప్పటికే 18 దేశాలతో భారత్ ఒప్పందాలు చేసుకోగా, వాటిలో 13 ఒప్పందాలు అమల్లోకి వచ్చాయన్నారు. నాస్కామ్ లెక్కల ప్రకారం అత్యధికంగా దాదాపు రెండు లక్షల మంది అమెరికాలో పనిచేస్తున్నారని, ఆ దేశంతో ఈ ఒప్పందం లేకపోయినా భవిష్యత్‌లో చేసుకునే అవకాశం ఉందన్నారు. శుక్రవారం దిల్‌కుశా అతిథిగృహంలో ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్, కార్మిక సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    రాష్ట్రీయ కార్మికుల బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ)కు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు త్వరగా స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని దత్తాత్రేయ సూచించారు. తెలంగాణ రాష్ర్టంలోని 15 లక్షల బీడి కార్మికుల కుటుంబాలకు స్కాలర్‌షిప్‌లను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, బీడికార్మికుల కోసం సిరిసిల్లలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మరిన్ని వార్తలు