వివాదంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు

22 May, 2020 18:49 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : లాక్‌డౌన్‌ సమయంలో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం వివాదంగా మారింది. దీనిపై కాంగ్రెస్‌ నేతలు సురేష్ షెట్కార్, సంజీవరెడ్డిలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. స్థానిక పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలుగా, పోలీస్టేషన్‌ను పార్టీ కార్యాలయంగా మార్చారని మండిపడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తూ నారాయణ్ ఖేడ్‌లో భూపాల్రెడ్డి ఘనంగా పుట్టిన రోజు వేడుకులను జరిపారని ఆరోపిస్తున్నారు. దీనికి వందల మంది అతిథులు హాజరయ్యారని, బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారని విమర్శించారు. దీనిపై వారు హైకోర్టును సైతం ఆశ్రయించారు. (దశల వారీగా షూటింగ్స్‌కు అనుమతి)

మరోవైపు భూపాల్‌రెడ్డి పుట్టినరోజుకు సంబంధించి స్థానిక ఓ విలేఖరి వార్తను ప్రచురించినందుకు ఎమ్మెల్యే అనుచరులు అతనిపై దాడికి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారని వార్తను రాసినందుకు ఆ విలేఖరి ఇళ్లును కూల్చివేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై  ఓ జాతీయ మీడియా సంస్థ వార్తను ప్రచురించడం గమనార్హం. నిర్మాణంలో ఉన్న ఇంటిని అక్రమ కట్టడంగా భావించి జర్నలిస్ట్‌పై కక్షపూరితంగా వ్యవహరించి ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి ఆదేశాలతో ఇంటిని కూల్చి వేశారని  ఆ పత్రిక పేర్కొంది.

ఇక తాజా వివాదంపై నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి స్పందించారు. తన పుట్టిన రోజు నాడు అభిమానులు నిర్వహించిన సేవా కార్యక్రమాలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరించారని తెలిపారు. కరోనా ఉధృతంగా ఉన్నందున జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ‘ఆరోజు నా శ్రేయోభిలాషులు నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ ,  రక్త దానం  చేశారు. అందులోనూ భౌతిక దూరం పాటించారు. కావాలనే కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకొని ప్రసారం చేయాలి. కాంగ్రెస్ నేతలు హైకోర్టులో వేసిన కేసు నిలువదు’ అని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు