టెన్త్ పరీక్షల కోసం కంట్రోల్‌రూం

26 Feb, 2015 03:08 IST|Sakshi
టెన్త్ పరీక్షల కోసం కంట్రోల్‌రూం

- సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయండి
- జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మార్చి 25 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 427 పరీక్షా కేంద్రాలున్నందున ప్రతి కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 94,181 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు మౌలికవసతులు కల్పించాలన్నారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాశాఖలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. సమస్యలుంటే 040- 23231858 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. పరీక్ష నిర్వహణకు 4,710 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని, 45 రూట్ అధికారులు, 427 ఛీఫ్ సూపరింటెం డెంట్లు, 20 ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించి పరీక్షలు పక్కాగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
అనంతరం డీఈఓ రమేష్ మాట్లాడుతూ ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.15వరకు పరీక్ష జరుగుతుందని, కొత్త పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నాపత్రాన్ని చదువుకునేందుకు వీలుగా 15 నిమిషాల సమయం అదనంగా ఇస్తున్నామన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ సుభాష్‌చంద్రబోస్, ఆర్టీఓ దుర్గాదాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు