స్పీడ్‌ రైడ్‌..డెడ్లీ దౌడ్‌!  

12 Dec, 2017 08:01 IST|Sakshi

ఓఆర్‌ఆర్‌పై  ‘యమా’ వేగం 

 గంటకు 140 నుంచి 200 కి.మీ వేగంతో రయ్‌రయ్‌... 

 స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాల నిఘా ఉన్నా ఏమాత్రం తగ్గని వైనం 

 మూడు లక్షలకు చేరిన ఉల్లంఘనుల సంఖ్య 

 నవంబర్‌ నెలాఖరు వరకు 3,02,295 వాహనాలపై ‘స్పీడ్‌’ కేసులు 

 రూ.43 కోట్ల 37 లక్షలకు పైగా జరిమానా 

 అతివేగంతో వాహనాల్లో పనిచేయని సేఫ్టీ మెజర్స్‌ 

 ఈ ఏడాది 45 రోడ్డు ప్రమాదాలు... 39 మంది మృతి 

 రేపటి నుంచి పొగమంచు కప్పే చాన్స్‌... స్పీడ్‌ తగ్గాల్సిందే..

ఔటర్‌ రింగురోడ్డుపై వాహనాలు జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. పరిమితికి మించి రెట్టింపు వేగంతో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతున్నాయి. వాయువేగం కారణంగా చివరకు వాహనంలోని సేఫ్టీ పరికరాలు సైతం పనికిరాకుండా పోతున్నాయి. వేగ నియంత్రణ కోసం ఔటర్‌ రింగురోడ్డులో స్పీడ్‌లేజర్‌ గన్‌ నిఘా ఉంచినా ఫలితం లేదు. సగటున 140–200 కి.మీ వేగంతో కార్లు, ఇతర వాహనాలు దూసుకెళ్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఈమేరకు మూడు లక్షల మందికి పైగా ఉల్లంఘనులను గుర్తించారు. దాదాపు రూ.43 కోట్లకుపైగా జరిమానా విధించారు. ఈ ఏడాది నవంబర్‌ వరకు ఔటర్‌పై 45 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా 39 మంది మృత్యువాతపడ్డారు.
            
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన  ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై వాహనదారులు వాయు వేగంతో దూసుళ్తున్నారు. అతివేగం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి హెచ్‌ఎండీఏ, సైబరాబాద్, రాచకొండ పోలీసులు అమలు చేస్తున్న ‘స్లో స్పీడ్‌ సాంకేతిక వ్యవస్థ’ వాహనదారుల వేగం ముందు తెల్లబోతోంది. ఈ ఏడాది నవంబర్‌ నెలాఖరునాటికి 3 లక్షల రెండు వేల 295 మంది వాహనదారులు 140 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లినట్లు ‘స్పీడ్‌ లేజర్‌ గన్‌’ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ ప్రకారం నిబంధనలు అతిక్రమించిన వీరికి రూ.43 కోట్ల 37 లక్షల 93 వేల 325 జరిమానా విధించారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌లో శామీర్‌పేట–కీసర మార్గం, వట్టినాగులపల్లి, పోశెట్టిగూడ, హిమాయత్‌సాగర్, రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తుక్కుగూడ, రావిర్యాల, బొంగళూరు వద్ద అతివేగంతో వాహనాలు దూసుకెళ్తున్నాయని స్పీడ్‌ గన్‌ కెమెరా గణాంకాలు వెల్లడిస్తున్నాయని ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. రెండు కమిషనరేట్ల పరిధిలోని 156.9 కిలోమీటర్ల పరధిలో ఈ ఏడాది జరిగిన 45 రోడ్డు ప్రమాదాల్లో 39 మంది దుర్మరణం చెందారు. 66 మంది గాయపడ్డారు. పొగమంచు కమ్మే డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరిగే అస్కారముందని, ఈ సమయంలోనైనా వాహనాలు వేగాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు.  

వేగం తగ్గించినా మారని తీరు... 
గంటకు 120 కిలోమీటర్ల వేగపరిమితి ప్రమాణాలతో నిర్మించిన ఓఆర్‌ఆర్‌లో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన పోలీసులు ఆ వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ ఆరు నెలల క్రితం నోటిఫికేషన్‌ జారీచేశారు. అయినా వాహనదారుల్లో ఏమాత్రం స్పీడ్‌ జోష్‌ తగ్గలేదు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్డు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధ్యయనంలో తేలినా వాహనదారులు గమ్యానికి చేరుకునే క్రమంలో తమ ప్రాణాల కంటే వేగానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదాల బారిన పడి అసువులు బాస్తున్నారు. ఈ అతి వేగం ఉన్న సమయంలో సేఫ్టీ మెజర్స్‌ కూడా పనిచేయడం లేదు. 

నిఘా మరింత పెంచాలి... 
ఓఆర్‌ఆర్‌పై వాహనాల వేగాన్ని పరిశీలించేందుకు టోల్‌ప్లాజాల వద్ద తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులు భావించినట్టుగా వేగనియంత్రణ సాధ్యం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిఘా లేకపోవడంతో తమపై పర్యవేక్షణ లేదనే భావనతో వాహనచోదుకులు ఇష్టానుసారంగా వెళ్తున్నారు. నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఆభయకేసు ఉదంతంతో ఓఆర్‌ఆర్‌పై నిఘాలేమి బహిర్గతమైంది. అభయను అపహరించిన దుండుగులు ఓఆర్‌ఆర్‌పై దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణించినా ఎక్కడా ఆ దృశ్యాలు నమోదు కాలేదు. ఆ తర్వాత హెచ్‌ఎండీఏ అధికారులు అప్రమత్తమైనట్టు కనిపించినా...ప్రస్తుతం టోల్‌ ప్లాజాల వద్ద మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. అయితే ఈ ఏడాది సైబరాబాద్, రాచకొండ పోలీసులకు ఎనిమిది స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలు ఇచ్చారు. దీంతో పెట్రోలింగ్‌ వాహనాల్లో ఆ స్పీడ్‌ లేజర్‌ గన్‌ కెమెరాలను వివిధ ప్రాంతాల్లో ఉంచుతూ అతివేగంతో వెళ్లే వాహనదారులకు ఈ–చలాన్‌లు ఇస్తున్నారు.

తీవ్రత ఎలా ఉందంటే... 
2014: సెప్టెంబర్‌ 29న తెల్లవారుజామున శంషాబాద్‌ వద్ద ఓఆర్‌ఆర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఉన్నతాధికారి సత్యనారాయణ కుటుంబసభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో కూతురు తీవ్రంగా గాయపడింది. వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

 2015: నవంబర్‌ 25న తెల్లవారుజామున 6.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన స్కోడా కారు ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు వరుణ్‌ పవార్‌తో పాటు వారి స్నేహితులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.  

 2017: నవంబర్‌ 23న ఓఆర్‌ఆర్‌ పెద్దఅంబర్‌పేట సమీపంలో సాయంత్రం ఆరు గంటల సమయంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాదర్‌గుల్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్న అభిషేక్‌ (19), మన్నగూడ వాసి మహేశ్‌(20) కన్నుమూశారు. 

సైబరాబాద్‌ పరిధి ఓఆర్‌ఆర్‌లో... 
ఠాణాలు             కేసులు    జరిమానా 
మాదాపూర్‌       67,562    9,69,51,470 
అల్వాల్‌            20175    2,89,51,125 
శంషాబాద్‌         89588    12,85,58,780 
రాజేంద్రనగర్‌      60306    8,65,39,110 
జీడిమెట్ల          19,437    2,78,92,095 
మొత్తం           2,57,068    36,88,92,580 

రాచకొండ పరిధి ఓఆర్‌ఆర్‌లో...      
ఠాణాలు          కేసులు    జరిమానా 
ఉప్పల్‌              173    2,48,255 
వనస్థలిపురం    45,054    6,46,52,490 
మొత్తం            45,227    64,90,0745  

మరిన్ని వార్తలు