సంతానం కలిగిస్తామని..మోసం చేశారు

20 Dec, 2014 16:24 IST|Sakshi
సంతానం కలిగిస్తామని..మోసం చేశారు

కరీంనగర్: కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రం వివాదాల్లోకెక్కింది. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసిన డాక్టర్ పద్మజ ఫలితం చూపకపోగా, ఇదేమిటని ప్రశ్నించినందుకు తుపాకీ ఉందని బెదిరించారని వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన బలిజ శశికళ దంపతులు ఆరోపించారు.
 
  తమను సెక్యూరిటీ సిబ్బందితో ఆసుపత్రి నుంచి బయటకు గెంటి వేయించారని పేర్కొంటూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. మరోవైపు తమపై వచ్చిన ఆరోపణలను డాక్టర్ పద్మజ కొట్టిపారేశారు. శశికళ దంపతులకు మూడుసార్లు పరీక్షలు చేయాల్సి ఉండగా, ఒకేసారి పరీక్షలు చేయించుకుని వెళ్లారని తెలిపారు. మరోసారి వస్తే గర్భం వచ్చే అవకాశాలున్నాయని చెప్పినా వినకుండా డబ్బులివ్వాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై ఇటీవల తాము న్యాయస్థానం ద్వారా పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
 
 ఈ వ్యవహారంపై కరీంనగర్ టూ టౌన్ పోలీసులు స్పందించారు. శశికళ దంపతులను స్టేషన్‌కు పిలిపించి వారి నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. అదే సమయంలో ఆసుపత్రి నిర్వాహకుల నుంచి శశికళ దంపతులకు నిర్వహించిన పరీక్షల రిపోర్టులను తెప్పించుకుని నిజనిర్దారణ కోసం నిపుణుల కమిటీకి పంపించారు. కమిటీ వెల్లడించే నివేదిక మేరకు తగిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ టూ టౌన్ పోలీసులు తెలిపారు. శశికళ దంపతులు, పోలీసులు, డాక్టర్ పద్మజ తెలిపిన మేరకు వివరాలు..
 
 ఆస్తి అమ్మి డబ్బులు చెల్లించాం

 బలిజ శశికళ, శ్రీనివాస్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ ‘మాది వరంగల్ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్  మండలం తాటికొండ గ్రామం. 13 ఏళ్లుగా సంతానం కలగడం లేదు. డాక్టర్ పద్మజ సంతాన సాఫల్యం ప్రకటనలు చూసి గత జూన్‌లో అక్కడికి వెళ్లాం. పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పద్మజ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సంతానం పొందడానికి దంపతులిద్దరికీ అవకాశాలున్నాయని చెప్పింది. అందుకు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపింది. గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాకపోతే మూడుసార్లు ఉచితంగా చేస్తామని, తప్పకుండా గర్భం వస్తుందని హామీ ఇవ్వడంతో   మూడున్నర లక్షలు చెల్లించాం.

వైద్యసేవలు అందిస్తున్న సమయంలో అదనంగా మరో లక్షన్నర  విలువైన మందులు రాశారు. మొదటి సారి గర్భం దాల్చే ప్రక్రియ విజయవంతం కాలేదు. రెండవసారి చేయడానికి అండాలు చెడిపోయాయని, వాటికి మరో యాభైవేలు చెల్లించాలని తెలిపారు. పిల్లల కోసం ఉన్న ఆస్తితోపాటు పుస్తెల తాడు కూడా తాకట్టు పెట్టామని, ఇక డబ్బులివ్వలేమని చెప్పినా వినిపించుకోలేదు. సమయానికి ఇవ్వాల్సిన ఇంజక్షన్ ఇవ్వలేదు. దీంతో నా పూర్తిగా ఆరోగ్యం పాడైంది. గిట్లయిందేందని అడిగితే డాక్టరమ్మ ‘నువ్వెక్కువగా మాట్లాడుతున్నవని తిట్టింది.

మీలాంటి వారికోసమే తుపాకీ లెసైన్స్ తీసుకున్నాం.. మా ఆయన వద్ద ఆ తుపాకీ ఉంది’ అంటూ బెదిరించింది. ‘ఏం చేసుకుంటావో చేసుకో, ఎవరూ ఏమీ చేయలేరు. మాకు మంత్రులు, ఎస్పీ వంటి వారు తెలుసు’ అంటూ సెక్యూరిటీతో బయటకు గెంటేయించింది. ఏం చేయాలో తెలియక మేం డీఎంహెచ్‌వో కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినం. వినియోగదారుల మండలిని కూడా ఆశ్రయించినం. మీరైనా మాకు న్యాయం జరిగేలా చేయండి* అంటూ వేడుకున్నారు.
 
 వాళ్లే మమ్నుల్ని బెదిరించారు.. - డాక్టర్ పద్మజ వివరణ
 సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ పద్మజ సాక్షితో మాట్లాడుతూ ‘శశికళ దంపతులకు ఐవీఎఫ్ ద్వారా ఇప్పటికీ గర్భం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం గరిష్టంగా మూడుసార్లు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పాం. కానీ వాళ్లు ఒక్కసారి మాత్రమే పరీక్షలు నిర్వహించుకున్నారు. రెండోసారి పరీక్షలు నిర్వహిస్తుండగా మధ్యలోనే మానేశారు. పైగా పరీక్షల కోసం ఖర్చయిన డబ్బు మొత్తం ఇవ్వాలని లేనిపక్షంలో, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇతరుల ద్వారా ఫోన్లు చేయించి ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయిస్తామని వేధించారు. దీంతో మేమే ఈ విషయంపై న్యాయస్థానం ద్వారా పోలీస్‌స్టే షన్‌ను ఆశ్రయించాం’ అని వివరించారు. వాస్తవానికి సంతానం కోసం తమ వద్దకు వచ్చేవాళ్లలో ఎనభై శాతం మంది ఫలితం పొందుతున్నారని, మొత్తం రూ.1.5 లక్షల నుంచి రూ.1.70 లక్షలు మాత్రమే ఇందుకు ఖర్చవుతోందని వెల్లడించారు. లెసైన్స్‌డ్ తుపాకీ అంశాన్ని ప్రస్తావించగా ‘మావద్ద లెసైన్స్‌డ్ గన్ ఉన్న మాట వాస్తవమే. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎవరినీ బెదిరించలేదు’ అని పేర్కొన్నారు.
 
 కేసును విచారిస్తున్నాం
 శశికళ దంపతులు తమను బెదిరిస్తున్నారని డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు న్యాయస్థానం ద్వారా ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా శశికళ దంపతులను పిలిచి వారి స్టేట్‌మెంట్ తీసుకున్నాం. అదే సమయంలో ఆ దంపతులకు నిర్వహించిన వైద్యపరీక్షల పత్రాలను సంబంధిత ఆసుపత్రి నుంచి సేకరించాం. నిజనిర్దారణ కోసం వైద్యనిపుణుల కమిటీకి పంపించాం. కమిటీ వెల్లడించే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటాం...  - కరీంనగర్ టూటౌన్ సీఐ హరిప్రసాద్
 
 మేం చేసేదేమీ లేదు

 ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యసేవలు పొందడం రోగి, డాక్టర్ మధ్య ఒప్పందం ప్రకారం జరుగుతుంటుంది. ఇందులో డీఎంహెచ్‌ఓ చేసేదేమీ లేదు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్, అర్హులైన డాక్టర్, ఆస్పత్రిలో వైద్యసేవలు, సౌకర్యాలు వంటివి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ఉన్నాయా లేదా అనేది మేం పరిశీలిస్తాం. రోగికి డాక్టర్ అందించిన సేవలపై అనుమానం ఉంటే చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ పరంగా ఫీజు, వైద్యసేవల ఖర్చులు వంటి వివరాలు అడిగే  హక్కు మాకు లేదు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ చట్టం 2002 ప్రకారం నిబంధనలు అమలయ్యేలా మాత్రమే చూడడం మా పని. -డీఎంహెచ్‌ఓ అలీమ్
 
 నోటీసు పంపిస్తున్నాం

 బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పద్మజ సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ పద్మజకు నోటీసు పంపిస్తున్నాం. నోటీసులో బాధితురాలు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని, వైద్యం వల్ల కలిగిన అనారోగ్యానికి కొంత సొమ్ము చెల్లించాలని కోరాం. ఆస్పత్రి నుంచి ఇచ్చిన బిల్లులు కూడా ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. బిల్లు కింద అడ్రస్ మాత్రమే ఉంది.
 -ఎన్.శ్రీనివాస్, వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు
 
 మార్చిలోనూ ఇదే తరహా ఫిర్యాదు
 పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై గత మార్చిలోనూ ఇదే తరహా ఫిర్యాదు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)కు అందింది. ఈ ఏడాది మార్చి 2న ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌కు చెందిన చీనూరి రాజబాబు, రమ దంపతులు పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై ఫిర్యాదు చేశారు. సంతానం కలిగిస్తామంటూ తమవద్ద రూ.2లక్షలు వసూలు చేసిన డాక్టర్ మిగిలిన రూ.1.75 లక్షలు సకాలంలో ఇవ్వలేదనే కారణంతో తమను దుర్భాషలాడటమే కాకుండా, మీలాంటి వాళ్లను తుపాకీతో కాల్చిపారేయాలని, రూంలో పడేసి తన్నాలంటూ బెదిరింపులకు గురిచేస్తూ ఆసుపత్రి నుంచి గెంటేయించారని రాజబాబు దంపతులు ఐఎంఏకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు