‘ఎక్స్‌ అఫీషియో ఓటు నమోదు’పై వివాదం

27 Jan, 2020 03:53 IST|Sakshi

కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం ముందు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్‌ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు నమోదుపై నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ఇక్కడ ఓటు హక్కు నమోదుకోసం దరఖాస్తు పెట్టుకోగా జాబితాలో ఆయన పేరులేదని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగింది. మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్‌ పార్టీకి దక్కుతుందనే ఉద్దేశంతో కావాలనే మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికారులు కుమ్మకై ఆయన పేరును తొలగించారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

కేవీపీ పేరును తొలగించి అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేటలోని కలెక్టర్‌ క్యాం పు కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి 10.30 గంటలకు కాంగ్రెస్‌ శ్రేణులతో కలసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉందన్న అక్కసుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు.

మరిన్ని వార్తలు