వివాదాల సుడిగుండంలో ఇంటింటి సర్వే!

9 Aug, 2014 10:33 IST|Sakshi
వివాదాల సుడిగుండంలో ఇంటింటి సర్వే!

* బతుకుదెరువు కోసం వెళ్లిన లక్షలాది జనం
* సూరత్, భీవండితోపాటు గల్ఫ్ దేశాలకూ వలసలు
* సుదూర ప్రాంతాల్లో గొర్రెలకాపర్లు, కూలీలు
* ఒక్కరోజులో సర్వే ఎలా సాధ్యమవుతుంది?
* ప్రభుత్వంపై విమర్శలకు దిగిన ప్రతిపక్షాలు
 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ఇంటింటి సర్వేను పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ నెల 19న ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏ గ్రామానికి చెందిన వారు ఆ గ్రామంలో లేకుంటే ప్రభుత్వం, సంక్షేమ పథకాల లెక్కల్లో లేనట్టేనని హెచ్చరించడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, అత్యవసర విధుల్లో ఉన్నవారు, పొట్టకూటి కోసం వివిధ వృత్తులవారు రోజుల తరబడీ, నెలల తరబడీ ఊరికి దూరంగా వెళ్తుం టారు. ఆ ఒక్కరోజు వ్యక్తిగతంగా వెళ్లలేకపోతే జీవితాంతం నష్టపోవాల్సిందేనా? అని వారు భయాందోళన చెందుతున్నారు.

ఉదాహరణకు.. తెలంగాణలో గణనీయంగా గొర్రెల కాపరులు దూరప్రాంతాల్లో ఉన్న జిల్లాలకు వరుసగా ఐదారు నెలల పాటు వలస వెళ్తారు. మహబూబ్‌నగర్‌కు చెందిన గొర్రెల కాపర్లు గొర్రెల మంద(జీవాల)ను ఇటు కరీంనగర్ నుంచి అటు గుంటూరులాంటి జిల్లాలకు కాలినడకన కొట్టుకుని పోతారు. ఇంటింటి సర్వే విషయంపై వీరికి కనీసం సమాచారం అందే అవకాశమే తక్కువ. ఒకవేళ ఇప్పుడున్న సెల్‌ఫోన్ల వంటి సమాచార వ్యవస్థ వల్ల సమాచారం అందినా.. గొర్రెల మందను ఎక్కడో విడిచిపెట్టి స్వంత గ్రామాలకు చేరడం సాధ్యం కాదు. హైదరాబాద్, ఇతర పట్టణాలకు కూలీ పనులు, చిన్న జీతాల కోసం వెళ్లినవారికీ ఆ ఒక్కరోజే ఊరికి వెళ్లడం సాధ్యమేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది.

ఆస్పత్రుల్లో ఉన్నవారి సంగతి...?
అత్యవసర వైద్యం అవసరమై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు, వారికి అటెం డెంట్లుగా ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడానికి అవకాశం లేదు. వైద్యం, ఫైరింగ్, పోలీసు వంటి అత్యవసర ఉద్యోగాల్లో ఉన్నవారూ వ్యక్తిగతంగా హాజరు కావడం చాలా కష్టం. మీడియాలో పనిచేస్తున్నవారు కూడా స్వంత గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందే. అందరికీ ఒకేరోజు సెలవు ఇస్తే ఆస్పత్రులు, మీడియా వంటి సంస్థలు ఎలా నడుస్తాయి? స్వంత గ్రామాల్లోనే వీరి వివరాలను నమోదు చేసుకోవాలనుకున్నవారు వీటిపై సతమతమవుతున్నారు.

ఇతర ప్రాంతాల్లోని వారెట్లా..?
పొట్ట చేతపట్టుకుని దుబాయ్‌కి వలస వెళ్లినవారు కరీంనగర్, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి ఎందరో ఉన్నారు. సూరత్ (గుజరాత్), భీవండి (మహారాష్ట్ర) లాంటి ప్రాంతాల్లోని వివిధ పరిశ్రమల్లో రోజుకూలీలుగా పనిచేయడానికి తెలంగాణ జిల్లాల్లోని వేలాది కుటుంబాలు వలస వెళ్లాయి. కాళ్లుచేతుల్లో సత్తువ ఉన్నంతకాలం రెక్కల కష్టంతో కొంత సంపాదించుకుని, సొంత గ్రామంలోనే స్థిరపడాలని చాలామంది కోరుకుంటున్నారు. వీరంతా ఒకేరోజు రావాలంటే రవాణా సదుపాయాలు సాధ్యం కావడం లేదు. వీరిలో కొందరికి సమాచారం లేకపోగా మరికొందరికి ఇదేంటో అర్థం కావడం లేదు.

కచ్చితంగా సొంత గ్రామానికి రావాలని కోరుకుంటున్నవారికి రైలు టికెట్లు దొరకడం లేదు. ఇప్పటికే సూరత్ నుంచి వచ్చే రైళ్లకు టికెట్లన్నీ బుక్ అయిపోయాయి. ఇక విదేశాల్లో ఉన్నవారికి విషయం తెలిసినా ఒక్కరోజు కోసం రావడం సాధ్యమేనా? అనే అనుమానాలు ముప్పిరి గొంటున్నాయి. అప్పోసప్పో చేసి విదేశాలకు వెళ్లిన చిరువేతన జీవులు వేలకు వేలు ఖర్చుచేసి ఒక్కరోజుకోసం స్వంత గ్రామానికి రావాలంటే ఎన్నో వ్యయప్రయాసలుంటాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా.. ఒక్కరోజే ఈ సర్వే అంటే ఎలా సాధ్యమని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు