గుండె గు‘బిల్లు’

17 Jun, 2018 12:54 IST|Sakshi
తనకు వచ్చిన బిల్లును చూపిస్తున్న లక్ష్మీనారాయణ 

కమలాపూర్‌ : కూలీ ఇంటికి మోయలేని కరెంట్‌ బిల్లు వచ్చింది. నెలకు సగటున రూ.150 నుంచి రూ.250 వరకు వచ్చే విద్యుత్‌ బిల్లు ఏకంగా రూ.41,279 రావడంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. బాధితుడి బాధితుడి కథనం ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన కూలీ వెల్దండి లక్ష్మీనారాయణ తన పేరిట 2217 సర్వీసు నంబరపై కొన్నేళ్ల క్రితం విద్యుత్‌ మీటరు తీసుకుని వినియోగించుకుంటున్నాడు. అయితే ఆయన కరెంట్‌ కనెక్షన్‌ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి నెలా రూ.150 నుంచి రూ.250 వరకే బిల్లు వచ్చేది. అలాంటిది జూన్‌ నెలకు సంబంధించి రూ.41,279 బిల్లు వచ్చింది. దీంతో కంగుతిన్న లక్ష్మీనారాయణ వెంటనే బిల్లులు చెల్లించే కౌంటర్‌ వద్దకు శనివారం వెళ్లారు.

అయితే రంజాన్‌ పర్వదినం కావడంతో అక్కడ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగించలేదని, నెలనెలా క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తున్నానని తెలిపారు. విద్యుత్‌ అధికారులు స్పందించి బిల్లు వెంటనే తగ్గించాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై విద్యుత్‌శాఖ ఏఈ లక్ష్మణ్‌నాయక్‌ను వివరణ కోరగా.. లక్ష్మీ నారాయణ ఇంటికి బిల్లు ఎక్కువ వచ్చేందుకు కారణాలు తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు బిల్లు తగ్గింపుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు