సహకార ఎన్నికలు లేనట్టేనా?

22 Jul, 2019 06:57 IST|Sakshi

ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నుంచి రాని ప్రకటన

ఇప్పటికే మూడుసార్లు  గడువు పొడిగింపు

సాక్షి, భువనగిరి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. జిల్లాలో 110 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాలక వర్గాలకు జూలై నెలాఖరుకు పదవీకాలం ముగుస్తుంది. 

ప్రస్తుత పాలకమండళ్లకే పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా..
ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్‌ పడింది.

గతంలోనే ఓటరు జాబితా సిద్ధం
ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్‌ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది.

సహకార సంఘాలకు 2018డిసెంబర్‌లోనే రాష్ట్ర సహకార కమిషనర్‌ నుంచి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్‌ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. 

సంఘం నిర్మాణం ఇలా..
ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13మంది పాలకవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ 01, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, బీసీ మహిళ 01, ఓసీ 7మంది సభ్యులుగా కొనసాగుతారు. వీరి లో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్‌ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు. 

వాయిదాపడే అవకాశం ఉంది
2013జూన్‌ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్‌ విడుదల కావడంతో ఓటర్‌ జాబితా సిద్ధం చేసి పంపాం. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్‌ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది.      –వెంకట్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్‌చార్జ్‌ అధికారి 

మరిన్ని వార్తలు