కంది కొనుగోళ్లలో దళారులకు చెక్‌

31 Jan, 2018 16:21 IST|Sakshi
సొసైటీ కొనుగోలు చేసిన కందులను ఆరబెట్టిన దృశ్యం

మోర్తాడ్‌(బాల్కొండ) : కంది కొనుగోళ్లలో దళారుల దగాకు చెక్‌ పెట్టింది తాళ్లరాంపూర్‌ సహకార సంఘం. వ్యాపారుల బారిన పడకుండా రైతులకు మద్దతు ధర చెల్లిస్తూ ఇప్పటికే నాలుగు వేల సంచులను కొనుగోలు చేసింది. కందికి రూ.5,450 చొప్పున మద్దతు ధర చెల్లిస్తూ రైతులకు భరోసా కల్పిస్తోంది. వాస్తవానికి బయట మార్కెట్‌లో దళారులు క్వింటాల్‌కు రూ.4 వేల నుంచి రూ.4,200 వరకు మాత్రమే ధర చెల్లిస్తూ రైతులను మోసగిస్తున్నారు. అయితే, తాళ్ల రాంపూర్‌లో కంది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు మద్దతు ధర లభిస్తోంది.

మోర్తాడ్, ఏర్గట్ల, మెండోర మండలాలకు సంబంధించిన తాళ్ల రాంపూర్‌ కొనుగోలు కేంద్రంలోనే పంట ఉత్పత్తులు విక్రయించి మద్దతు ధర పొందుతున్నారు. పది రోజుల కింద ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా, ఇప్పటివరకు నాలుగు వేల సంచుల కందులను కొనుగోలు చేశారు. కందులు విక్రయించిన రైతులకు వారం రోజుల్లోనే సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు తాము పండించిన కందులను మంచి ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాన్ని మరిన్ని రోజులు కొనసాగిస్తామని, రైతులు నాణ్యమైన కందులను తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని సొసైటీ చైర్మన్‌ సోమ చిన్న గంగారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. రైతుల ప్రయోజనాలు కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు.
 

మరిన్ని వార్తలు