కరోనా ప్రభావిత ప్రాంతాల్లో కార్డన్‌ ఆఫ్‌?

6 Apr, 2020 08:38 IST|Sakshi
ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వద్ద కరోనా అనుమానితులు ఉన్న∙ప్రాంతాల్లో నోటీసు అంటిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బంది

పాజిటివ్‌ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటరు మేర రాకపోకలు బంద్‌

ఇంటింటికీ ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే

హాట్‌స్పాట్‌ల వద్ద మరింత అలర్ట్‌

కరోనా కట్టడికి కఠిన చర్యలు అమలు

సాక్షి, సిటీబ్యూరో: కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘కార్డన్‌ ఆఫ్‌’ వంటివి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాజిటివ్‌గా వెల్లడైన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు, సోకేందుకు అనుమానం ఉన్న వారిని ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా, కరోనా బాధితులను కలిసి ఉండటం వంటి అంశాలతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచడమో లేక ప్రభుత్వ క్వారంటైన్‌లకు తరలించడమో చేస్తున్నారు. పాజిటివ్‌ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ‘ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే’ నిర్వహిస్తారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం, జలుబు, ఇతరత్రా  కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి శాంపిల్స్‌ను ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్‌ ఉన్నదీ తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే.. ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా, ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే ‘కార్డన్‌ ఆఫ్‌’ వంటివి చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అనుమానితులు, పాజిటివ్‌ ప్రాంతాల్లో సర్వే మొత్తం పూర్తయ్యాక, అవసరాన్ని బట్టి ఇలాంటి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.          సంబంధిత పరిధి వరకు హైపోక్లోరైట్‌ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మరింత  మెరుగుపరుస్తారు.

హాట్‌ స్పాట్ల వద్ద మరిన్ని జాగ్రత్తలు..
వీటితోపాటు  ఒకే ప్రాంతంలో  పది అంతకంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులున్న ప్రాంతాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించనున్నట్లు సమాచారం. ఈ హాట్‌స్పాట్ల వద్ద  మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. అయితే ఎన్ని కేసులు ఒకే చోట ఉంటే వాటిని హాట్‌స్పాట్లుగా గుర్తించాలనే అంశంలో  పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. 

వేగంగా .. జియో ట్యాగింగ్‌..
కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల కనుగుణంగా చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ అర్థరాత్రుల్లో సైతం వైద్యారోగ్యశాఖ, పోలీసు అధికారులు, తదితరవిభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుకనుగుణంగా అధికారులు  పాజిటివ్‌ కేసులు, ‘మర్కజ్‌’ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్‌ పనులు వేగంగా           చేస్తున్నారు. 

హోమ్‌ క్వారంటైన్‌లపై నిఘా..
హోమ్‌ క్వారంటైన్లలో ఉంటున్నవారిపై వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులతో కూడిన బ్రుందాలు నిఘా కార్యక్రమాలు  కొనసాగిస్తున్నాయి. హోమ్‌క్వారంటైన్లలో ఉంటున్న వారు నిబంధనల కనుగుణంగా వ్యవహరిస్తున్నదీ లేనిదీ పరిశీలిస్తున్నాయి. ఒక్కో బృందం దాదాపు ఇరవై మంది హోమ్‌ క్వారంటైన్‌లోని వ్యక్తులను పరిశీలిస్తోంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో హోమ్‌ క్వారంటైన్‌ ఉంటున్నవారు నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారంగా జనంలో కలుస్తున్నారని ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు