తెలంగాణలో మరో 56 కొత్త కేసులు

22 Apr, 2020 02:23 IST|Sakshi

అత్యధికంగా సూర్యాపేటలో 26 

జీహెచ్‌ఎంసీతో కలిపి 9 జిల్లాల్లో కేసులు నమోదు

రాష్ట్రంలో 928కి చేరిన కరోనా కేసులు

నేడు సూర్యాపేట, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో సీఎస్, డీజీపీ పర్యటన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మంగళవారం ఒక్క రోజే కొత్తగా 56 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 928కి చేరింది. ప్రస్తుతం కరోనా బారినపడి 711 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 194 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా.. 23 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు బులెటిన్‌ విడుదల చేశారు. సూర్యాపేటలో ఒకే రోజు అత్యధికంగా 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 80కి చేరింది. ఇక మంగళవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో కలిపి 9 జిల్లాల్లో మంగళవారం కేసులు నమోదయ్యాయి.

నేడు మూడు జిల్లాలకు ఉన్నతస్థాయి బృందం..
అత్యధికంగా కేసులు నమోదవుతున్న సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో రాష్ట్ర ఉన్నత స్థాయి బృందం బుధవారం పర్యటించనుంది. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఈ మూడు జిల్లాల్లో పర్యటించనుంది. ఈ బృందంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు. అయితే ఇప్పటికే మంగళవారం రాత్రే డాక్టర్‌ శ్రీనివాస్‌రావు సూర్యాపేటకు చేరుకున్నారు. మూడు జిల్లాల్లో పరిస్థితిపై ఈ బృందం సమీక్ష చేయనుంది. కేసులు అధికంగా పెరగడానికి గల కారణాలను అధ్యయనం చేయనుంది. పరిస్థితి నియంత్రణకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ బృందం తెలుసుకోనుంది. అనంతరం ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించనుంది. చదవండి: విదేశీ విద్యపై తగ్గని మోజు!

జనతా కర్ఫ్యూకు నెల..
జనతా కర్ఫ్యూను కేంద్రం గత నెల 22న దేశవ్యాప్తంగా ప్రకటించింది. అనంతరం మరుసటి రోజు నుంచే తెలంగాణలో లాక్‌డౌన్‌ మొదలైంది. దీంతో నెల రోజులుగా ప్రజలాంతా లాక్‌డౌన్‌లో ఉన్నారు. బస్సులు, రైళ్లు, ఆటోలు సహా పబ్లిక్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థ మొత్తం నిలిచిపోయింది. హోటళ్లు, థియేటర్లు, క్లబ్బులు, పబ్బులు, ఫంక్షన్‌ హాళ్లు అన్నీ మూసేశారు. తాజాగా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించారు. లాక్‌డౌన్‌తో జనాలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం పూర్తి స్థాయిలో ఆగలేదు.
మంగళవారం నమోదైన కరోనా కేసుల సంఖ్య 
జిల్లా పేరు   పాజిటివ్‌ కేసులు
1) సూర్యాపేట    26
2) జీహెచ్‌ఎంసీ   19
3) నిజామాబాద్‌   3    
4) గద్వాల          2
5) ఖమ్మం          1
6) మేడ్చల్‌         1
7) వరంగల్‌         1
8) ఆదిలాబాద్‌     2
9) రంగారెడ్డి        1
మొత్తం    56

>
మరిన్ని వార్తలు