అమ్మకు ఏమైంది!?

1 Jul, 2020 10:26 IST|Sakshi
తల్లి ఉన్న గది వద్ద పిల్లలు

‘‘నానమ్మా.. అమ్మకు ఏమైంది.. ఎన్ని రోజులు ఆ రూంలోనే ఉంటది.. అమ్మ బువ్వ తినిపిస్తలేదు.. అమ్మ దగ్గరికి మేం ఎందుకు వెళ్లద్దు..’’ అంటూ గుక్కపట్టి ఏడుస్తూ ఆ చిన్నారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆ నానమ్మ తల్లడిల్లిపోతోంది.. మరోవైపు పిల్లల ఏడుపులు చెవిన పడి పక్క గదిలోనే ఉన్న తల్లి పిల్లలను అక్కున చేర్చుకోలేక గుండెలవిసేలా రోదిస్తోంది.. కరోనాతో భర్తను కోల్పోయి హోంఐసోలేషన్‌లో ఉంటున్న అయిలాపూర్‌కు చెందిన ఓ తల్లి గుండెకోత ఇదీ.. ‘‘ఇరవై రోజులైతుంది.. అమ్మ ఎక్కడుంది.. ఇంకెన్ని రోజులకు ఇంటికి వస్తుంది.. అమ్మ దగ్గరికి పోయి తీసుకొద్దాం.. అమ్మ వచ్చినంక ముంబయిలోని మనింటికి వెళ్లిపోదాం..’’ అంటూ కోరుట్లకు చెందిన పదేళ్లలోపు పిల్లలు ఇద్దరు తల్లి కోసం తండ్రిని నిలదీస్తూ రోజూ కంటతడి పెడుతున్నారు.

సాక్షి, కోరుట్ల: అనుబంధాలు, ఆత్మీయతల మధ్య కరోనా వైరస్‌ పెను అగాధాన్ని సృష్టిస్తోంది. కరోనాతో మృతిచెందిన వారి అంత్యక్రియలకు బంధుగణం దూరంగా ఉండటం ఓ దీనావస్థ కాగా.. పసి పిల్లలు కరోనా సోకిన తల్లులకు రోజుల తరబడి దూరంగా ఉండాల్సిన దయనీయ స్థితి గుండెలను పిండేస్తోంది. కోరుట్ల పట్టణంలో ఓ వృద్ధుడు నెలరోజుల క్రితం కరోనాతో మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను పదిహేను రోజులపాటు జగిత్యాలలోని ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. మృతిచెందిన వ్యక్తి కోడలుకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమెను జగిత్యాల నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లి రోజుల తరబడి కనబడకుండా పోవడంతో ఆమె పిల్లలు ఇద్దరు తండ్రి వద్ద ఉంటూ రోజు అమ్మ ఎక్కడుంది. అమ్మకు ఏమైందంటూ విలపించడం చుట్టుపక్కల వారిని కలచివేసింది. (జీహెచ్‌ఎంసీ: వెంటాడుతున్న కోవిడ్‌ భూతం! )

అచ్చు ఇదే తీరుగా కోరుట్ల మండలంలోని అయిలాపూర్‌లో కరోనాతో భర్త మృతి చెందడంతో భార్య హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో చికిత్స కోసం భర్తను ఉంచి పిల్లల కోసం బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా భర్త మృతి సంగతి తెలుసుకున్న ఆమె తనకు తానుగా వైద్యులకు, పోలీసులకు ఫోన్‌ చేసి ఐసోలేషన్‌కు వెళ్లింది. ఇంటి వద్ద ఉండటానికి చుట్టుపక్కల వారు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు పిల్లలను ఇంట్లోనే ఉంచి గ్రామంలోని పాఠశాలలో ఐసోలేషన్‌లో ఉంది. ఇరవై రోజులు గడిచిపోయినా పిల్లలను దగ్గరకు తీసుకుంటే ఎక్కడ వారికి వైరస్‌ వస్తుందోనన్న భయంతో ఇప్పటికీ హోం ఐసోలేషన్‌ను కొనసాగిస్తుండటం తల్లి పడుతున్న వేదనకు అద్దం పడుతుంది. (కారు బోల్తా.. మాజీ మంత్రికి తప్పిన ప్రమాదం) 

దగ్గరి బంధువులే దిక్కు..
కరోనా వైరస్‌తో తల్లులు హోం ఐసోలేషన్‌కు వెళుతుండగా పిల్లలను దగ్గరి బంధువుల దగ్గర ఉంచాల్సిన పరిస్థితి. కొంత మంది పిల్లలు అమ్మమ్మ, నానమ్మల వద్ద ఉంటున్నారు. కరోనా సోకిన వారి ఇళ్లకు వెళ్లకుండా అందరూ దూరంగా ఉంటున్నారు. కరోనా భయం ఉన్నా.. తప్పని పరిస్థితిలో దగ్గరి బంధువులే పసివాళ్లను పట్టించుకుని అవసరాలు తీర్చుతున్నారు. కరోనా వైరస్‌ విషయం సరిగా అర్థం చేసుకోలేని వయసులో ఉన్న పిల్లలు తల్లులు దూరంగా ఉండటంతో ఏం జరిగిందని వేస్తున్న ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేని అయోమయ పరిస్థితి. పెద్దవాళ్లు కరోనాతో ఎదురయ్యే పరిస్థితులను అర్థం చేసుకుంటుండగా అభం శుభం తెలియని చిన్నారులు మాత్రం కన్నీళ్లు పెట్టని రోజు లేదు.

మరిన్ని వార్తలు