వీడియోకాల్‌తో ‘కరోనా’ కన్సల్టేషన్‌

21 Apr, 2020 02:15 IST|Sakshi

లక్షణాలు ఉన్నవారితో మాట్లాడి అంచనా వేయండి

వైద్యులకు ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌’ పిలుపు

అవసరాన్ని బట్టి హోం క్వారంటైన్‌ సలహా ఇవ్వాలి..

వీలైతే పరీక్షలకు సన్నాహాలు

ఆస్పత్రుల్లో రద్దీ నియంత్రణకు పరిష్కారం

సాక్షి, హైదరాబాద్‌ : వీడియో కాల్స్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కరోనా కన్సల్టేషన్‌ ప్రక్రియ దోహదపడుతుందని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ (బీ ఎంజే) వెల్లడించింది. దీన్నే రిమోట్‌ కన్సల్టింగ్‌ అంటారు. కరోనా అనుమానితులు ఆస్పత్రులకు రాకుండానే, వారి లక్షణాలను ఆన్‌లైన్‌ ద్వారా అంచనా వేయొచ్చని, ఆయా లక్షణాలను బట్టి వారిని హోం క్వారంటైన్‌లో ఉంచొచ్చని తెలిపింది. వారి లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రికి రిఫర్‌ చేయొచ్చని పేర్కొంది. దీన్ని వైద్యులు ప్రోత్సహించాలని సూచించింది. వీడియో కాల్‌ (కొన్నిసార్లు టెలిఫోన్‌ ద్వారా) ద్వారా జరిగే ఈ కన్సల్టేషన్‌ ప్రక్రియ ద్వారా చాలావరకు కరోనా అనుమానితులు ఆస్పత్రులకు రాకుండానే చూడొచ్చని తెలిపింది.

ఈ వీడియో కాల్‌ కరోనా కన్సల్టేషన్‌పై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, కొన్ని దేశాల్లో అనేకమంది డాక్టర్లు దీన్ని అనుసరిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వారిని అనవసరంగా ఆస్పత్రికి రప్పించడం, లక్షణాలుంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉండటం వంటి కారణాల వల్ల వీడియో కన్సల్టేషన్‌ ప్రక్రియకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవేళ వారికి లక్షణాలున్నట్లు అంచనాకు వస్తే, సంబంధిత కరోనా ఆస్పత్రికి రిఫర్‌ చేయడానికి వీలుంటుంది. పైగా వైరస్‌ విస్త్రృతంగా, వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో వీడియో కన్సల్టేషన్‌ ప్రక్రియ మరింత ఉపయుక్తంగా ఉంటుందని బీఎంజే అభిప్రాయపడింది. 

వీడియో కాల్‌ ద్వారా వివరాల సేకరణ..
వైరస్‌ వ్యాప్తి విపరీతంగా ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా అనుమానితులను చూడటానికి కూడా ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో వీడియో కన్సల్టేషన్‌ ప్రక్రియ ప్రయోజనకరంగా ఉంటుంది. టెలిఫోన్‌ ద్వారా కూడా సమాచారం సేకరించొచ్చు కానీ, రోగిని నేరుగా ఆన్‌లైన్‌లో చూస్తేనే అంచనా వేయొచ్చని బీఎంజే సూచించింది. కరోనా లక్షణాల్లో ప్రధానమైనది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దగ్గు ఉంటుంది. అసాధారణ జ్వరం ఉంటుంది. అలసట, ఆకలి లేకపోవడం, నిరంతరం పొడి దగ్గు ఉంటుంది. ఆ తర్వాత తేలికపాటి విరేచనాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వారిని వీడియో కాలింగ్‌ ద్వారా పరీక్షించే వీలుంటుంది. వీడియో కన్సల్టేషన్‌కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను బీఎంజే వెల్లడించింది. చదవండి: లాక్‌'డౌన్‌': ప్రజలు రోడ్లెక్కేశారు 

మార్గదర్శకాలు ఇవే..
– వీడియో కన్సల్టేషన్‌ ప్రతి అనారోగ్య సమస్యకు పరిష్కారం కాదు. అలాగే కరోనా నిర్ధారణ అయిన రోగి చికిత్స నిర్వహణకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.
– కరోనా అనుమానిత సాధారణ లక్షణాలున్న వారిని ఆన్‌లైన్‌లో చెక్‌ చేయడానికి వీలుంది. అత్యంత తేలికపాటి లక్షణాలు ఉన్నవారికైతే టెలిఫోన్‌ ద్వారా కూడా కన్సల్టేషన్‌ చేయొచ్చు.
– వీడియో కాలింగ్‌లో అప్పటికే రోగికి సంబంధించిన వివిధ వైద్య పరీక్షల పత్రాలను నేరుగా డౌన్‌లోడ్‌ చేసి డాక్టర్‌కు ఆన్‌లైన్‌లో పంపొచ్చు.
– కరోనా లక్షణాలు ఉన్నవారిని వీడియో కాలింగ్‌ ద్వారా పరీక్షించొచ్చు. రోగులు వీడియో ద్వారా డాక్టర్‌కు చెప్పడానికి ఇష్టపడతారు.
– రోగితో వీడియో కాలింగ్‌కు ముందే రోగి వైద్య రికార్డులను ముందు పెట్టుకోవాలి. అంటే మధుమేహం, మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి, గర్భం, లేదా కీమోథెరపీ, స్టెరాయిడ్స్‌ లేదా ఇతర రోగ నిరోధక మందులు తీసుకోవడం వంటివి, ధూమపానం, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధులుంటే వాటి వైద్య పరీక్షల వివరాలను ముందే తెప్పించుకోవాలి. 
– వీడియో కాలింగ్‌ నాణ్యతతో వీడియో స్పష్టంగా కనిపించేలా చూడాలి. 
– రోగుల పరిస్థితిని గమనించాలి. వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో గమనించాలి. పడుకున్నారా? కూర్చున్నారా? బాధపడుతున్నట్లు అనిపిస్తుందా? మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా? అనారోగ్యంగా కనిపిస్తున్నారా.. చూడాలి.
– రోగి అనారోగ్యంగా అనిపిస్తే, నేరుగా సంబంధిత క్లినికల్‌ ప్రశ్నలు వేయాలి. తద్వారా వారి నుంచి సమాచారం రాబట్టాలి. మరింత తీవ్రమైన కేసుల్లో సాధారణంగా శ్వాసకోశ సమస్యలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి లేని రోగులు విలక్షణంగా కనిపిస్తారు.
– జ్వరం ఎంతుందో అడగాలి. జ్వరం ఎన్నాళ్ల నుంచి వస్తుందో తెలుసుకోవాలి. సాధారణంగా జ్వరం 5 రోజులకు మించి ఉంటుంది.
– కరోనా అనుమానిత రోగుల్లో ప్రధానంగా శ్వాసకోశ లక్షణాలను ఆన్‌లైన్‌లో అంచనా వేయడం కష్టమే. అయితే కొందరు వైద్యులు ఆన్‌లైన్‌లో కానీ, టెలిఫోన్‌లో గానీ రోగి మాట్లాడేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయగలరు. అయితే తీవ్రమైన సందర్భంలో ఒక్కోసారి తప్పుదారి పట్టే అవకాశముంది. అందువల్ల రోగుల శ్వాస క్రియ సమస్యను వారి మాటల్లోనే వివరించాలని డాక్టర్లు అడగాలి.
– మీ శ్వాస ఎలా ఉంది? ఎక్కువ మాట్లాడలేకపోతున్నారా? సాధారణం కంటే గట్టిగా లేదా వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నారా? రోజువారీ కార్యకలాపాలన్నింటినీ ఆపేసేంత అనారోగ్యంతో ఉన్నారా? వంటి ప్రశ్నలు అడగాలి. మంచి వీడియో కనెక్షన్‌ ద్వారా శ్వాసకోశ రేటు కొలవడం సాధ్యమే అంటున్నారు.
– కుటుంబంలో మరెవరైనా అనారోగ్యంతో ఉన్నారా అని అడగండి. 
– ముక్కు దిబ్బడ, కళ్ల కలక వంటివి ఉన్నాయో తెలుసుకోవాలి. చాలా మంది రోగుల్లో ఆకలి లేకపోవడం ప్రధానంగా ఉంటుంది. వాసన లక్షణాన్ని కోల్పోతారు. 
– ఒకవేళ లక్షణాలు సాధారణమైనవి అయితే మందులను సూచించాలి. హోం క్వారంటైన్‌లో ఉండాలని చెప్పాలి. కుటుంబసభ్యుల నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని చెప్పాలి.
– శారీరక పరీక్షలు ఆన్‌లైన్‌లో చేయలేరు. రిమోట్‌ కన్సల్టేషన్‌లో వ్యక్తిలో లక్షణాలు తీవ్రంగా ఉంటే వ్యక్తిగతంగా చూడాలి. అప్పుడు ఆస్పత్రికి రిఫర్‌ చేయాలి.  

మరిన్ని వార్తలు