రైతు సమస్యలపై చొరవ చూపండి

19 Apr, 2020 09:31 IST|Sakshi

పంట కొనుగోలు, నష్టాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని రైతులకు ఉపశమనం కలిగించాలి

సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన ఉత్తమ్, భట్టి

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. పంట దిగుబడుల కొనుగోలు, ఉపాధి హామీ పథకం అమలు, అకాల వర్షాలతో కలిగిన నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షులు ఎన్‌.కోదండరెడ్డి తదితరులు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. 

ఏ గ్రామంలో పండిన పంట అదే గ్రామంలో కొనుగోలు చేయాలని, ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గత వారం ఆ శాఖ మంత్రి తెలిపినప్పటికీ మూడో వంతు మాత్రమే తెరిచారని, గోనె సంచులు లేక గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం సేకరణకు శాస్త్రీయ విధానాన్ని అనుసరించాలని డిమాండ్‌ చేశారు. మొక్కజొన్న సేకరణలో నిబంధనలు సవరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ పంట తీసుకొచ్చే రైతుపై ఎలాంటి జరిమానాలు విధించవద్దన్నారు. వరి కొనుగోలులో తరుగు ఎక్కువగా చేస్తున్నారని, క్వింటాలుకు ఒక కిలో చొప్పున మాత్రమే తరుగు విధించాలన్నారు. బత్తాయి ఎగుమతులపై నిషేధంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. 

ఉద్యాన పంటల్లో 68 శాతం ఉన్న మామిడి పంట దిగుబడులకు ప్రణాళిక తయారు చేయాలని, లేకుంటే రైతులు మరింత నష్టపోతారన్నారు. అదేవిధంగా పూల రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఉపాధి హామీ పథకం పాత బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, వీటిని వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. లాక్‌డౌన్‌కు ముందు విధుల నుంచి తొలగించిన ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వాలని, ఇన్‌పుట్‌ సబ్సిడీ బకాయిలు చెల్లించాలన్నారు. కరోనాపై యుద్ధంలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, తమ అనుభవాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వానికి లేఖలో సూచించారు.

మరిన్ని వార్తలు