కరోనా : హాట్‌స్పాట్‌లో కరీంనగర్‌

15 Apr, 2020 19:36 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్ని కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక తెలిపారు. జిల్లాలో మొత్తం 6 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయని వెల్లడించారు. హై రిస్క్ వ్యాధులతో ఉన్న వారిని నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. నగరంలోకి వచ్చే రహదారుల్లో చెక్  పోస్టులు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కంటోన్మెంట్‌లో బారికేడ్లు ఎన్ని రోజులు కొనసాగించాలనే మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉందని వెల్లడించారు.  వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కరీంనగర్ హాట్ స్పాట్‌లో ఉందని అన్నారు.

జిల్లాలో 322మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారని, ఇప్పటి వరకు 329 నమూనాలను సేకరించి వైద్య పరీక్షలకు పంపామని పేర్కొన్నారు. వైరస్‌ కేసులు పెరుగుతుండటంతో అంతా బాగుంది అన్న స్థితికి ఇంకా మనం రాలేదనే విషయాన్ని గ్రహించాలని కలెక్టర్‌ సూచించారు. బ్యాంకుల్లో రూ.1500 క్రెడిట్ అయ్యాయని గుంపులు గుంపులుగా బయటకు రావద్దని చెప్పారు. అరవై ఏళ్ల పైబడిన వారికి కరోనా వైరస్‌ సోకే అవకాశం ఎక్కువగా ఉండటంతో వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు