ఎత్తు తగ్గనున్న ఖైరతాబాద్‌ వినాయకుడు

12 May, 2020 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ వినాయకుడిపై కరోనా ప్రభావం పడింది. కరోనా నేపథ్యంలో భారీ విగ్రహ ఏర్పాటును కమిటీ విరమించుకుంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే విగ్రహం ప్రతిష్టించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఈ నెల 18న  నిర్వహించాల్సిన కర్ర పూజ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. పోలీసులు అనుమతి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది.

ఈ నెల 18న ఖైరతాబాద్ గణేష్ విగ్రహ కర్రపూజ ప్రారంభించాలని అనుకున్నామని.. కానీ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ర పూజ ని రద్దు చేశామని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్ ‘సాక్షి’కి తెలిపారు. ‘‘18 తలలతో విశ్వరూప వినాయకుడు ప్రతిష్టించాలని అనుకున్నాం. ఒక్క అడుగు తో పక్కనే ఉన్న ఆలయంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం. కరోనా వ్యాప్తి తగ్గితే భారీ వినాయకుడిని ప్రతిష్టించే ఆలోచన చేస్తామని’’ పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ అధికారులను కలుస్తామని తెలిపారు. అనంతరం తమ నిర్ణయం ప్రకటిస్తామని సుదర్శన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు