హైదరాబాద్‌ టూ సేడం

30 Mar, 2020 08:05 IST|Sakshi
తాండూరు టౌన్‌: కాలినడకన భార్యా పిల్లలతో వెళ్తున్న హన్మంతు

సుమారు 170 కిలోమీటర్లు కాలినడకన..

తాండూరు టౌన్‌ : కరోనా మహమ్మారి విజృంభణతో వలస కూలీల బతుకులు ఛిద్రమయ్యాయి. హైదరాబాద్‌ పట్టణంలో ఉండలేక సొంతూరికి వెళ్లాలనుకున్న వారికి ఇబ్బందులు తప్పలేదు. బతికుంటే బలుసాకు తినొచ్చని భావించిన వలస కూలీలు సొంతూరుకు పయనమయ్యారు. అయితే లాక్‌డౌన్‌తో వాహనాలేవీ లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి సేడం వరకు సుమారు 170 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లాలని ఓ కుటుంబం రెండు  రోజుల క్రితం బయలు దేరింది. కర్నాటక రాష్ట్రం సేడంకు చెందిన హన్మంతు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలసపోయి అక్కడ మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో సొంతూరికి శుక్రవారం తన భార్య, ముగ్గురు పిల్లలతో బయలుదేరారు. ఆదివారం మిట్ట మధ్యాహ్నం తాండూరు పట్టణానికి చేరిన అతన్ని ‘సాక్షి’ కదిలించింది. రెండు రోజులుగా అక్కడక్కడ అన్నం అడుక్కుంటూ, తన పిల్లలకు పెడుతూ కాలినడక కొనసాగిస్తున్నారు. తాండూరులో ఓ స్వచ్ఛంద సంస్థ వారు వీరిని గుర్తించి భోజనం ప్యాకెట్లు అందజేశారు. తిన్న తర్వాత తిరిగి కాలినడక కొనసాగించారు. 

బతుకు లేక.. బతక లేక

దౌల్తాబాద్‌: వలస కూలీలు కాలినడకన పట్నంనుంచి పల్లెబాట పట్టారు. మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు, గిరిజనులు బతుకుదెరువుకు పట్నంకు వెళ్ళారు. అక్కడ కూలీ పనులు చేస్తూ బతుకు జీవనం గడుపుతున్నారు. కాగా లాక్‌డౌన్‌తో అక్కడ పని లేకపోవడంతో ఇది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియక ఇంటి బాట పట్టారు. ఇంటికివెళ్ళేందుకు వాహనలు లేకపోవడంతో కాలినడకన బయలుదేరారు. రహదారిపై చిన్న పెద్ద తేడా లేకుండా వెళ్తుండడంతో సమీప గ్రామస్తులు అల్పహారం అందిస్తున్నారు. పోలీసులు కూడా సహకరించడంతో వలస జీవులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు