ఆసుపత్రుల్లో భారీగా పేరుకుపోయిన మృతదేహాలు 

29 Jun, 2020 08:17 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : భయం.. భయం.. ఎటుచూసినా కరోనా భయం..ఎవరినైనా కలవాలన్నా.. ఎవరితో మాట్లాడాలన్నా అనుమానమే..ఈ కోవిడ్‌ మనుషులకు ఒకరకమైన భయాన్ని సృష్టించింది. ఈ పరిస్థితి ఇలా ఉంటే మృతదేహాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కనీసం అంత్యక్రియలకు కూడా మృతదేహాలు నోచుకోవడం లేదు. చనిపోయినవారి దహనసంస్కారాలు నిర్వహించేందుకు భౌతికకాయాన్ని శ్మశానవాటికకు తీసుకెళితే స్థానికుల నుంచి తీవ్ర ఇబ్బందులెదుర వుతున్నాయి. ఇక కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను పరిసర ప్రాంతాలల్లోకి కూడా రానీయడం లేదు. ఇది జీహెచ్‌ఎంసీ సిబ్బందికి పెద్ద సవాల్‌గా మారింది. కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలకు స్థానిక శ్మశానవాటికల్లో అంత్యక్రియలు నిర్వహిస్తుండటంతో వారి నుంచి ఎక్కడ తమకు వైరస్‌ విస్తరిస్తుందో అనే భయంతో స్థానికులు ఈ పక్రియను అడ్డుకుంటున్నారు.

గుర్తు తెలియని మృతదేహాలను తీసుకెళ్లినా.. కరోనా సోకిన వ్యక్తి మృత దేహంగా అనుమానించి అడ్డుకుంటున్నారు. స్థానికుల నుంచి వస్తున్న వ్యతిరేకతతో అధికారులు కూడా ఏం చేయలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా గాంధీ, ఉస్మానియా మార్చురీల్లో శవాలు గుట్టల్లా పేరుకుపోతున్నాయి. మార్చురీలోని ఫిజర్‌ బాక్సులు పని చేయక పోవడం, రోజుల తరబడి ఈ శవాలను తరలించక పోవడంతో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఆయా ఆస్పత్రుల మార్చురీల్లో ప్రస్తుతం రెండు వందలకు పైగా మృతదేహాలు నిల్వ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.  

మార్చురీల్లో పేరుకుపోతున్న శవాలు 
ఉస్మానియా, గాంధీ జనరల్‌ ఆస్పత్రుల అత్యవసర విభాగానికి రోజుకు సగటున 300 మంది క్షతగాత్రులు వస్తుంటారు. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు సగటున 15 నుంచి 20 మంది చనిపోతుంటారు. వీరిలో ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు అనాధలు కూడా ఉంటారు. ఆస్పత్రిలో చనిపోయిన వారి మృతుల శవాలు పాడుకాకుండా మూడు రోజుల పాటు ఫ్రీజర్‌బాక్స్‌లో నిల్వ ఉంచుతారు. ఈ లోపు బంధువులెవరైనా వచ్చి..గుర్తిస్తే వాటిని వారికి అప్ప గిస్తారు. మూడు రోజుల తర్వాత ఎవరూ రాకపోతే..వాటిని అనాధ శవాల కేటగిరిలో వేసి..స్టోర్‌ రూమ్‌లో వేస్తారు. అనాధ శవాలకు 2013 వరకు సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్‌ నిర్వహకులు దహన సంస్కారాలు నిర్వహించేవారు. శవాల తరలింపులో అనేక ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్పటి నుంచి ఈ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించింది. ఇందుకు రూ.5400 వరకు జీహెచ్‌ఎంసీ ఖర్చు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఆయా శవాలను నగర ంలోని వివిధ శ్మశాన వాటికలకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించేవారు. ప్రస్తుతం సాధారణ మృతులతో పాటు కరోనా మృతులు కూడా ఉంటున్నారు.

కరోనా సోకిన వ్యక్తి మృత దేహాలను తీసుకెళ్లేందుకు బంధువులు ముందుకు రావడం లేదు. సాధారణ మృతదేహాలతో పాటు కరోనా సోకిన వ్యక్తుల మృతదేహాలకు కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బందే దహన సంస్కారాలు నిర్వహిస్తుంది.  ఇళ్ల మధ్య ఉన్న స్మశాన వాటికల్లో వీటిని పూడ్చడం, కాల్చడం వల్ల తమకు ఎక్కడ వైరస్‌ సోకు తుందోనని స్థానికులు భయపడుతున్నారు. సమీప స్మశాన వాటికల్లో అంత్యక్రియలను అడ్డు కుంటున్నారు. మార్చురీల్లో శవాలు పేరుక పోతుండటంతో వాటి గుర్తింపు బంధువులకు ఇబ్బందిగా మారింది. స్టోర్‌రూమ్‌లో పెద్ద మొత్తంలో శవాలు పోగై ఉండటం,  అప్పటికే మృత దేహాలు గుర్తుపట్టలేనంతగా మారు తున్నాయి. దగ్గరికి వెళ్లి వాటిని చూసే ధైర్యం లేక దూరం నుంచే చూసి..ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని తీసుకెళ్తుండటం, తీరా దహన స్మశానవాటికకు చేరుకున్న తర్వాత బంధువులు గుర్తించి....ఇది తమ వారి మృతదేహం కాదని చెప్పుతుండటం ఆందోళన కలిగిస్తుంది.  

896 శ్మశాన వాటికలున్నా.. ఏ ఒక్క దానిపై అధికారం లేదు 
ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 11364 మంది కరోనా వైరస్‌ భారిన పడగా, వీరిలో 230 మంది చనిపోయారు. మృతుల్లో 200 మంది గ్రేటర్‌ హైదరాబాద్‌కు చెందిన వారే. మృతదేహాలను తీసుకెళ్లేందుకు బంధువులు కూడా వెనుకాడుతున్నారు. దీంతో వారి అంత్యక్రియ లను జీహెచ్‌ఎంసీ సిబ్బందే నిర్వహిస్తున్నారు. నగరంలో 896 స్మశాన వాటికలు ఉండగా, వీటి లో ఏ ఒక్కదానిపై కూడా ప్రభుత్వానికి అధికారం లేదు. ప్రస్తుతం ఇవన్ని స్థానిక కాటికాపర్లు, కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. వీటిలో చాలా వరకు నివాసాల మధ్యే ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు విన్పించుకోవడం లేదు. కరోనా నెగిటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్న మృతదేహాలకు కొన్ని స్మశాసవాటికలు అనుమతిస్తున్నప్పటికీ...నగరంలో చాలా వరకు నిరాకరి స్తుండటం ఆందోళన కలిగిస్తుంది.  

పని చేయని ఎలక్ట్రిక్‌ దహన వాటికలు 
నగరంలో ఆరు (బన్సీలాల్‌పేట్‌–2, అంబర్‌పేట్‌–2, ఎస్సానగ ర్‌–1, పంజాగుట్ట –1) ఎలక్ట్రిక్‌ దహన వాటికలు ఉన్నాయి. ఒక్కో మిషన్‌ రూ.కోటి వెచ్చిచ్చి కొనుగోలు చేశారు. 2012 నుంచి ఇవి పని చేయడం లేదు.  సాధారణంగా ఒక్కో డెడ్‌బాడీ దహన సంస్కారానికి రూ.5 నుంచి 7 వేలు ఖర్చు అవుతుంటే...అదే ఎలక్ట్రికల్‌ మిషన్‌ ఉంటే రూ.2500 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆ మిషన్లు పని చేయక పోవడంతో మృతదేహాల అంత్య క్రియల ఖర్చు కూడా రెట్టింపవుతుంది.  తెలంగాణ వ్యాప్తంగా  ప్రభుత్వ 11 మెడికల్‌ కాలేజీలు ఉండగా, మరో పది ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రతి పది మంది విద్యార్థులకు ఒక డెడ్‌బాడీ అవసరం ఉంటుంది. ఇలా ఏటా 400 శవాలు అవసరం. మెడికల్‌ కాలేజీల బలహీనతను మార్చురీల్లో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది ఆసరాగా చేసుకుంటున్నారు.

శరీరంపై ఎలాంటి గాయాలు లేని మృతదేహాలను మెడికల్‌ కాలేజీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. ఒక్కో శవాన్ని రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. బంధువులకు కుళ్లిపోయిన అనాధ శవాలను అప్పగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శవాల అమ్మకం ద్వారానే మార్చురీకీ భారీగా నిధులు సమకూరుతున్నట్లు తెలిసింది. 2014 నుంచి ఇప్పటి వరకు  ఎన్ని శవాలకు దహన సంస్కారాలు నిర్వహించింది? ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేసింది? అనే కనీస సమాచారం కూడా జీహెచ్‌ఎంసీ వద్ద కూడా లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.   

శ్మశానాల్లో స్థల సమస్య 
నగరంలో మృతిచెందుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో శ్మశానాల్లో స్థలాల కొరత ఏర్పడుతోంది. ముఖ్యంగా స్థానికంగా ఉండే వారి అంత్యక్రియలకే ప్రాధాన్యత ఇస్తారు. బార్కస్, మీస్రీగంజ్, ఖాద్రీచమన్, కుతుబ్‌షాహీ ఇలా పలు శ్మశానాల్లో స్థానికంగా నివాసం ఉండే వారి అంత్యక్రియలకే అనుమతి ఇస్తారు. అయితే మృతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో స్థల సమస్యతో ఇబ్బంది ఎదురవుతోంది. మరోవైపు సమాధి తవ్వడానికి వ్యక్తుల కొరత ఎక్కువగా ఉంది. 

మరిన్ని వార్తలు