కరోనా సోకిన గర్భిణికి ‘గాంధీ’లో పునర్జన్మ

14 May, 2020 05:04 IST|Sakshi
సంపూర్ణ ఆరోగ్యంతో పుట్టిన మగశిశువు 

విజయవంతంగా డెలివరీ చేసిన వైద్యులు

తల్లీబిడ్డ క్షేమం.. శిశువుకు కరోనా పరీక్షలు  

గాంధీ ఆస్పత్రి: కరోనా వైరస్‌తో బాధపడుతున్న నిండు గర్భిణికి సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి వైద్యులు పురుడుపోసి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడారు. కరోనా సోకిన గర్భిణీకి డెలివరీ చేయడం గాంధీ ఆస్పత్రిలో ఇది రెండోసారి. ఆస్పత్రి వైద్యవర్గాలు తెలిపిన వివరాల ప్రకారం బహుదూర్‌పురాకు చెందిన గర్భిణి (30)కి కరోనా సోకడంతో ఈ నెల 10న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ఆమెకు ఇది ఆరవ కాన్పు కావడం, అధిక రిస్క్, పీపీహెచ్‌ కాంప్లికేషన్లు ఉండటంతో ఈ కేసును ఆస్పత్రి వైద్యులు సవాల్‌గా తీసుకున్నారు. 

గర్భిణితోపాటు కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి అపాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. సాధారణ డెలివరీకి అవకాశం లేకపోవడంతో బుధవారం సిజేరియన్‌ శస్త్రచికిత్స నిర్వహించి పండంటి మగశిశువును బయటకు తీశారు. శిశువు 3 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నాడని, తల్లి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. మహిళకు కరోనా పాజిటివ్‌ కావడంతో పుట్టిన శిశువుకు తల్లిపాలు ఇవ్వడంలేదు. 
(చదవండి: లక్షణాల్లేని వారి నుంచే సంక్రమణ..)

ఎన్‌ఐసీయూలోని ఇంక్యుబేటర్‌లో ఉంచిన శిశువుకు బాటిల్‌ ఫీడింగ్‌ అందిస్తున్నారు. శిశువు నుంచి నమూనాలు సేకరించి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు పంపినట్లు వైద్యులు వివరించారు. గైనకాలజీ హెచ్‌వోడీ మహాలక్ష్మి నేతృత్వంలో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన గైనకాలజీ ప్రొఫెసర్‌ షర్మిల, అసిస్టెంట్‌ రాణిలతోపాటు అనస్తీషియా, పీడియాట్రిక్‌ వైద్యులను ఉన్నతాధికారులతోపాటు డీఎంఈ రమేష్‌రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు, మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రకాశరావులు అభినందించారు. 
(చదవండి: అలసట తెలీని వలస హీరోలు)

మరిన్ని వార్తలు