గాంధీలో కరోనా మరణం.. వైద్యులపై బంధువుల దాడి

1 Apr, 2020 21:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల కరోనా బాధితుడు మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 7కు చేరింది. అయితే అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు కరోనా వార్డులోకి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. అయితే సీపీ అంజనీకుమార్‌ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితని చక్కదిద్దారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.   

కాగా, నిర్మల్‌ పట్టణానికి చెందిన అన్నదమ్ముళ్లు కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వీరిద్దరు కూడా ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే చికిత్స పొందుతూ ఓ వ్యక్తి నేడు మరణించాడు. సోదరుడి మృతితో ఆగ్రహానికి లోనైన మరో వ్యక్తి వైద్యులపై దాడికి దిగాడు. ఈ ఘటనను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామని గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. ఇలాంటి కష్ట సమయంలో వైద్యులపై దాడి సరికాదని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఆయన మంత్రిని కోరారు.

వైద్యులపై దాడిని ఖండించిన ఈటల
గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడిని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితులో క్షమించబోమని స్పష్టం చేశారు. దాడిచేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటే వారిని కొట్టడమేమిటని ప్రశ్నించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ కష్ట కాలంలో ఇలాంటి ఘటనలు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్న వైద్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రతి డాక్టర్‌కు రక్షణ కల్పిస్తామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.

చదవండి : సిద్దిపేటలో తొలి కరోనా కేసు

మరిన్ని వార్తలు