కరోనా కలవరం : వీడని విషాదం

4 May, 2020 10:40 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్‌లో కరోనా మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత వారం కేసుల సంఖ్య తగ్గినట్లే కనిపించినా.. ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తోంది. మహమ్మారిన బారిన పడి బాధితులు మృతి చెందుతున్నారు. నాలుగు రోజులుగా రోజుకొకరు చొప్పున మృత్యువాత పడుతున్నారు. తాజాగా ఆదివారం జియాగూడ మటన్‌ వ్యాపారి (51) సహా రాంకోఠికి చెందిన వృద్ధుడు (67) మృతి చెందడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో మార్చి 2 నుంచి మే 3 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1082 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 624 కేసులు గ్రేటర్‌లోనివే. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా, వీరిలో 25 మంది గ్రేటర్‌ వాసులే ఉండటం గమనార్హం. ఇప్పటి వరకు కోర్‌సిటీలోని మర్కజ్‌ కాంటాక్టుల్లోనే కరోనా ఉన్నట్లు నిర్ధారణ కాగా.. ప్రస్తుతం హైదరాబాద్‌ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు అటుఇటుగా ఉన్న బస్తీలు, కాలనీల్లో కొత్త కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ.. ఎవరి నుంచి వీరికి వైరస్‌ సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. వైరస్‌ మూలాల గుర్తింపు వైద్య ఆరోగ్య శాఖకు ఇబ్బందిగా మారడంతో కేసుల ట్రేసింగ్‌ విషయంలో వారు కూడా చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తింది. (తండ్రి మరణించినా.. స్వదేశం రాలేక..!)

చావుబతుకుల మధ్య బాధితురాలు.. 
మలక్‌పేట్‌గంజ్‌లో పల్లినూనె వ్యాపారి (55)ద్వారా ఆయన సోదరుడి (45)కి ఆ తర్వాత వారి తండ్రి (70), తల్లి (65) సహా కుటుంబంలో మొత్తం తొమ్మిది మందికి కరోనా వైరస్‌ సోకిన విష యం తెలిసిందే. వీరిలో ఇప్పటికే తండ్రి సహా సోదరుడు మృతి చెందారు. ప్రస్తుతం ఆయన తల్లి కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. వృద్ధాప్యానికి తోడు భర్త, కొడుకును పోగొ ట్టుకున్నాననే బాధ, నిమోనియా, ఇతర అనారోగ్య సమస్యలు ఆమెను మానసికంగా మరింత కుంగదీస్తున్నాయి.

మరో 30 మంది అనుమానితులు.. 
గ్రేటర్‌లో ఆదివారం కొత్తగా మరికొన్ని పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరందరిని గాంధీ ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 530 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలి సింది. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రికి తాజాగా మరో ఆరుగురు అనుమానితలు వచ్చారు. ప్రస్తుతం ఉన్నవారిలో ఇద్దరికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వారిని గాంధీకి తరలించారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 26 మంది ఉన్నారు. వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ కాగా, 15 మందికి నెగిటివ్‌ రిపోర్టు రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో కొత్తగా ఏడు సస్పెక్టెడ్‌ కేసులు నమోదయ్యాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్‌ వచ్చిన ఆరుగురిని డిశ్చార్జి చేశారు. దగ్గు, జలుబు, జ్వరం ఇతర లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రికి చేరుకున్న వారి నుంచి స్వాబ్స్‌ సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలకు పంపారు. రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. (కరోనా.. 24 గంటల్లో 2,553 కేసులు)


కొత్త కంటైన్మెంట్‌ జోన్లు ఇవే.. 
నగరంలో కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. ఇటీవల రోజుకు సగటున ఐదు నుంచి పది కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గత రెండు మూడు రోజులుగా కొత్త కేసులు వెలుగు చూసిన ఆయా ప్రాంతాలను అధికారులు గుర్తించి కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ఇంతకు ముందు కరోనా వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటికి అటుఇటుగా కిలో మీటర్‌ పరిధిలోని ఇళ్లను కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోకి తీసుకురాగా.. ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తి ఇంటితో పాటు ఆయనకు సన్నిహితంగా మెలిగిన చుట్టుపక్కల వారి ఇళ్లను మాత్రమే కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొస్తున్నారు. వారి ఇళ్లకు తాళాలు వేసి, రాకపోకలను నిషేధిస్తున్నారు. కుటుంబ సభ్యులను 28 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు.  మలక్‌పేట్‌గంజ్, సరూర్‌నగర్‌లోని శారదానగర్, వనస్థలిపురంలోని ఎ– క్వార్టర్స్, హుడా సాయి నగర్, సుష్మాసాయి నగర్, కమలానగర్, రైతుబజార్‌ సమీపంలోని ఏ, బీ టైప్‌ కాలనీలు, ఫేజ్‌–1 కాలనీ, సచివాలయనగర్, ఎస్‌కేడీనగర్, సాహెబ్‌నగర్‌ రైతుబజార్‌ సహా సరూర్‌నగర్‌లోని  జింకలబావి కాలనీ, కర్మన్‌ఘాట్‌లోని భాగ్యనగర్‌ కాలనీ, కవాడిగూడలోని భాగ్యలక్ష్మీ కాలనీ, సోమాజిగూడలోని కుందన్‌బాగ్‌ అపార్ట్‌మెంట్, రాంకోఠి, ఆగాపురా, బాగ్‌అంబర్‌పేటలోని  సీఈ కాలనీ, జియాగూడ, సబ్జీమండి గంగపుత్ర కాలనీ, జియాగూడ వెంకటేశ్వర్‌నగర్, అంబర్‌పేటలోని చెన్నారెడ్డినగర్‌లలో కొత్తగా కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. చార్మినార్‌ జోన్‌ పరిధిలో కొత్తగా మరో నాలుగు సెంటర్లు చేరాయి. సికింద్రాబాద్‌లోని షాబాద్‌నగర్‌ కంటైన్మెంట్‌ జోన్‌ కొనసాగుతోంది. గ్రేటర్‌లో తాజాగా మరో 12 కంటైన్మెంట్‌ జోన్లు ఎత్తేసినట్లు తెలిసింది.
  
పర్యటన ముగింపు.. 
లాక్‌డౌన్‌ తర్వాత కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వయం గా పరిశీలించేందుకు ఏప్రిల్‌ 25న హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర బృందం ఆదివారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయింది. తెలంగాణ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (టిమ్స్‌) సహా గాంధీ, ఫీవర్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రు లను సందర్శించింది. ఆయా ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసింది. కంటైన్మెంట్‌ జోన్లు,  రైతుబజార్లు, అన్నపూర్ణ క్యాంటిన్లు, మార్కెట్లు సహా షెల్టర్‌హోంలను సందర్శించింది. అనాథలు, వలస కార్మికులను స్వయంగా కలిసింది. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బృందం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.

వనస్థలిపురంలో కరోనా పాజిటివ్‌ కేసు 
వనస్థలిపురం: వనస్థలిపురం ప్రాంతంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే వనస్థలిపురం ఏ–క్వార్టర్స్‌లో ఓ కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులు కరోనా బారిన పడగా అందులో ఇద్దరు మృతిచెందారు. తాజాగా వనస్థలిపురం హుడా సాయినగర్‌కు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్‌ రావడం స్థానికంగా అలజడి సృష్టిస్తోంది. వనస్థలిపురం హుడా సాయినగర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చింతల సంతోష్‌కుమార్‌ తల్లి, భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. తల్లి భారతీబాయి(64) కాలనీ పక్కనే ఉన్న వనస్థలిపురం హిల్‌కాలనీ క్వార్టర్స్‌లో కూతురింటికి 10 రోజుల క్రితం వెళ్లింది. అక్కడ ఆమెకు జ్వరం రావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించినా.. తగ్గకపోవడంతో మూడు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వారి సూచనల మేరకు కోరంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం ఆదివారం భారతీబాయికి కరోనా పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. కాగా భారతీబాయి అల్లుడు సురేష్‌ హిల్‌కాలనీలో జనరల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. విషయం తెలుసుకుని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భీమానాయక్‌ హిల్‌కాలనీకి చేరుకుని తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి ఆదేశాలిచ్చారు.

వాచ్‌మెన్‌ భార్యకి పాజిటివ్‌ 
ఖైరతాబాద్‌: ఖైరతాబాద్‌ సర్కిల్‌ పరిధిలో ఆదివారం ఇద్దరికి కరోనా వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించారు. కుందన్‌బాగ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తికి ఇప్పటికే  పాజిటివ్‌గా గుర్తించారు.  అతని భార్యకి  కూడా వైరస్‌ సోకినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అదే విధంగా ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సిబిఐ క్వార్టర్స్‌లో క్వారంటైన్‌లో  ఉన్న వారిలో ఒకరికి పాజిటివ్‌గా నమోదు చేశారు. గతంలో దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులను హోమ్‌ క్వారంటైన్‌కు సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో ఒకరికి  కరోనా వైరస్‌ సోకినట్టుగా నిర్ధారించడంతో క్వారంటైన్‌లో ఉన్న మిగిలిన వాళ్లకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిసింది. 

కంటైన్మెంట్‌ జోన్‌గా మున్సిపల్‌ కాలనీ 
చాదర్‌ఘాట్‌: ఓల్డ్‌ మలక్‌పేట మున్సిపల్‌ కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదివారం ప్రకటించారు. కాలనీకి ఆనుకుని వున్న క్రాంతి బార్‌ యజమానికి కరోనా పాజిటివ్‌ రావటంతో ఆ కాలనీ మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి బారికేడ్ల ద్వారా కాలనీకి రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు