కరోనా రికవరీ రేటు 99%

15 Jul, 2020 06:15 IST|Sakshi

మీడియాతో ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు

డెత్‌రేట్‌ ఒక్క శాతమే.. అదే జాతీయ స్థాయిలో 2.7%

పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి లక్షణాలు లేవు

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా కోవిడ్‌కు ఉచిత చికిత్స

రాష్ట్రంలో ప్రస్తుతం 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి రికవరీ రేటు 99 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకుడు జి.శ్రీనివాసరావు వెల్లడించారు. కేవలం ఒక శాతం మాత్రమే డెత్‌రేట్‌ ఉందని, జాతీయ స్థాయిలో కోవిడ్‌–19 డెత్‌ రేట్‌ 2.7 శాతంగా ఉందని  ఆయన వివరించారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో తీవ్రత తక్కువగానే ఉందని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌ కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డితో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మంగళవారం ఉదయం వరకు 36,221 పాజిటివ్‌ కేసులున్నాయని, 365 మంది మరణించారని చెప్పారు.

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉన్నట్లు వెల్లడించారు. పాజిటివ్‌ కేసుల్లో 80 శాతం మందికి లక్షణాలు లేవని, కరోనా వైరస్‌ నిర్ధారణ కోసం జీహెచ్‌ఎంసీలో 300 ల్యాబ్‌లలో పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 97,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కూడా కోవిడ్‌ చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 98 ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకు అనుమతి ఉందని, ప్రస్తుతం 54 ఆస్పత్రుల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందని వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లోనే గాంధీలో చికిత్స
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య విద్య సంచాలకుడు రమేశ్‌రెడ్డి చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రం గాంధీలోనే చికిత్స అందిస్తామన్నారు. పలు సందర్భాల్లో ప్రైవేటు ఆస్పత్రులు చివరి నిమిషాల్లో రోగులను గాంధీ ఆస్పత్రికి పంపిస్తున్నారన్నారు. లక్షణాలు లేని వారు గాంధీలో అడ్మిట్‌ కావడం వల్ల ఇతరుల ద్వారా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశముందని తెలిపారు. ప్లాస్మా థెరఫీ అందరికీ సరికాదని.. ప్లాస్మా బ్యాంక్‌ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఈ సమయంలో ఆందోళన చేయడం సరికాదని సూచించారు. జీతాలు పెంచుతామని, ఉద్యోగ క్రమబద్ధీకరణ అంశం కోర్టు పరిధిలో ఉందని వివరించారు. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. 

మరిన్ని వార్తలు