కరీంనగర్‌లో కరోనా కలకలం!

17 Mar, 2020 08:02 IST|Sakshi
కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రిలోని ప్రత్యేక వార్డు వద్ద కరోనా అనుమానితులు

సాక్షి, కరీంనగర్‌టౌన్‌: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం విదేశీయులు రావడంతో కరోనా(కోవిడ్‌ 19) లక్షణాలతో వచ్చారనే ఉద్దేశంతో ఆసుపత్రిలో కలకలం రేగింది. ఐసోలేషన్‌ వార్డు వద్ద విదేశీయులను కొందరు మాసు్కలతో, మరికొందరు కర్చీఫ్‌లు కట్టుకొని దూరం నుంచి వీక్షించారు. ఇక వైద్యులు, సిబ్బంది హైరానా పడ్డారు. కరోనా అనుమానితులకు పరీక్షలు చేయాలంటే సరైన రక్షణ కవచాలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అప్పటికప్పుడు హైరిస్క్‌ మాసు్కలు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు తెప్పించుకొని వారి వద్దకు వెళ్లారు. చెస్ట్‌ఫిజీషియన్‌ వారికి ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించగా, ఒకరికి దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నట్లు గమనించి డీఎంహెచ్‌వో, మెడికల్‌ సూపరింటెండెంట్‌కు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు చేరుకొని విదేశీయులుకు మాసు్కలు, గ్లౌజ్‌లు, ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక ఆఫ్రాన్‌ను అందించారు. జిల్లా కలెక్టర్‌ సూచన మేరకు హుటాహుటిన రెండు 108 వాహనాల్లో వారిని కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒకవేâళ అనుమానితుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే వారు ఎవరెవరిని కలిశారో వారందరికీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. 

ఇండోనేషియా నుంచి ఇండియాకు...
ఇండోనేషియాకు చెందిన పది మంది మత బోధకుల బృందం ఈ నెల 9న ఇ ండియాకు విమానంలో వచ్చారు. ఢిల్లీ చేరుకున్న ఈ బృందానికి విమానా శ్రయంలోనే స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి రామగుండంకు చేరుకొని, ఈ నెల 14న సా యంత్రం కరీంనగర్‌కు వచ్చి ఓ ప్రార్థన మందిరంలో బసచేశారు. 15న ఉదయం పోలీసులకు రిపోర్టు చేసేందుకు వెళ్లగా, స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకొని రిపోర్టులు అప్పగించాలని పోలీసులు సూచించారు. విదేశీ బృందం మొదట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ప్రైవేటు పరీక్షలు చెల్లవని, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని పోలీసులు సూచించారు. 

స్థానికులతో కలిసి ప్రభుత్వాసుపత్రికి...
వైద్యపరీక్షల నిమిత్తం స్థానికులైన ముగ్గురు వ్యక్తులతో కలిసి ఇండోనేషియా బృందం ప్రభుత్వాసుపత్రికి ఉదయం 10 గంటలకు చేరుకున్నారు. పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలో తెలియక మొదట మాతా శిశు కేంద్రానికి వెళ్లారు. అక్కడున్న సిబ్బంది సివిల్‌ ఆసుపత్రికి పంపించారు. వారిని విదేశీయులుగా గుర్తించిన సివిల్‌ ఆసుపత్రి సిబ్బంది ఐసోలేషన్‌ వార్డు వద్దకు తీసుకువచ్చి అక్కడే కూర్చోబెట్టారు. చెస్ట్‌ ఫిజీషియన్‌ పరీక్షలు నిర్వహించి ఒకరికి కొద్దిగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి...
విదేశీయులు వైద్యపరీక్షల నిమిత్తం రావడం, వారిలో ఒకరికి దగ్గు, జలుబు ఉన్నట్లు వైద్యులు గుర్తించడంతో కరోనా పేషెంట్లు వచ్చారనే వదంతులు ఒక్కసారిగా ఆసుపత్రి మొత్తం వ్యాపించాయి. దీంతో వైద్యులు, సిబ్బంది, ఆసుపత్రికి వచ్చిన రోగులతో సహా నగర ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుజాత, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్, ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య వెంటనే ఐసోలేషన్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించారు. అనుమానితుల నుంచి ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా డీఎంహెచ్‌వో వెంట తెచ్చిన అధునాతన ఎన్‌–95 మాసు్కలు, గ్లౌజ్‌లు, ఆఫ్రాన్‌లను 10 మంది విదేశీయలతోపాటు ముగ్గురు స్థానికులకు సైతం అందజేసి వారు ధరించేలా చర్యలు చేపట్టారు. 

108 వాహనాల్లో గాంధీ ఆసుపత్రికి...
విదేశీయుల్లో ఒకరికి లక్షణాలున్నాయన్న అనుమానంతో 13 మందిని రెండు 108 వాహనాల్లో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 108 వాహనాల్లో సానిటైజర్లు, క్లీనర్లు సమకూర్చారు. 108 వాహన పైలెట్లు, టెక్నీషియన్‌లకు పూర్తి రక్షణ చర్యలు కల్పించి వాహనాలను హైదరాబాద్‌కు పంపించారు. మార్గమధ్యంలో ఎక్కడా ఆపకుండా వెళ్లాలని సూచించారు. వాహనం నుంచి అనుమానితులను దించిన తర్వాత వాహనాన్ని కెమికల్స్‌తో శుభ్రం చేసుకోవాలని, సిబ్బంది సైతం పూర్తి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. 

పోలీసుల బందోబస్తు...
విదేశీయులు ఆసుపత్రికి వచ్చి రెండు గంటలపైనే కావడంతో వారు బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి సిబ్బంది నిలువరించినా ఆవరణలో అటూ ఇటు తిరగడం ప్రారంభించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు డీఎంహెచ్‌వో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఏసీపీ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని విదేశీయులతోపాటు స్థానికులు ఎక్కడికీ కదలకుండా ఐసోలేషన్‌ వార్డు ముందే కూర్చోబెట్టారు. ఇతరులు సైతం వారికి వద్దకు వెళ్లకుండా బందోబస్తు నిర్వహించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

మాస్క్‌ల కోసం పరుగులు...
విదేశీలు కరోనా లక్షణాలతో వచ్చారనే వదంతులతో ఆసుపత్రిలో సిబ్బంది, ఆసుపత్రికి వచ్చిన రోగులు, ఇతరులు మాసు్కల కోసం పరుగులు తీశారు. సిబ్బంది అందరికీ మాసు్కలు అందజేశారు. బయట వ్యక్తులు మాత్రం కర్చీఫ్‌లు కట్టుకొని ఆ ప్రాంతంలోకి వచ్చారు. సిబ్బంది మాత్రం కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. పూర్తి స్థాయి రక్షణ కవచాలు లేకుండా అనుమానితుల వద్దకు వెళ్లేందుకు భయపడ్డారు. మాసు్కలు, గ్లౌజ్‌లు, శానిటైజర్లు సమకూర్చాక ఐసోలేషన్‌ వార్డు వద్దకు వెళ్లారు. 

ఒక్కరికే లక్షణాలు...
ఇండోనేషియా నుంచి వచ్చిన వారిలో ఒక్కరికే దగ్గు, జలుబు లక్షణాలు ఉన్నాయి. అనుమానితుడిగా ఉన్న వ్యక్తితో సహా 10 మంది విదేశీయులు, వారితో ఉన్న ముగ్గురు స్థానికులను తగిన జాగ్రత్తలతో 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి తరలించాం. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
– డాక్టర్‌ సుజాత, డీఎంహెచ్‌వో 

మరిన్ని వార్తలు