మిస్సింగ్‌ కాదు.. వార్డు మారాడంతే!

7 Apr, 2020 02:49 IST|Sakshi

గాంధీలో కరోనా అనుమానితుడి మాయంపై కలకలం

పొరపాటున మరో అంతస్తులోకి వెళ్లి పడుకున్న వైనం

గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుడు కొద్దిసేపు కనిపించకుండాపోయిన ఘటన కలకలం సృష్టించిం ది. అతడి సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ రావడంతో వార్డు నుంచి పరారైనట్టు భావించారు. చివరకు ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డు లో బెడ్‌పై ఆదమరచి నిద్రిస్తున్న అతడిని గుర్తించిన వైద్యాధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

పొరపాటున ఐదో అంతస్తులోకి..
ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలకు వెళ్లొచ్చి న గద్వాలకు చెందిన వ్యక్తి (35)ని ఈనెల 2న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్‌ రావడంతో హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచి స్తూ పంపించేశారు. కా గా, హోం క్వారంటైన్‌ పరిశీలనకు వెళ్లిన వైద్యసిబ్బంది, పోలీ సులు.. అతడు కరోనా పాజిటివ్‌ వ్యక్తులతో కలిసి కొన్నిరోజులు గడిపినట్లు గుర్తిం చారు. ప్రస్తుతం నెగెటివ్‌ వచ్చినా తర్వాత పాజిటివ్‌ వచ్చే అవకాశం ఉందని భావించి, అతడిని గాంధీ ఆస్పత్రిలోనే క్వారంటైన్‌ చే యాలని భావించారు. దీంతో అతడిని ఈ నెల 5న తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చి, ఆరో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డులో బెడ్‌ కేటా యించారు. కొంతసేపటికి అతడు వార్డు నుం చి బయటికొచ్చి నమాజ్‌ చేసుకుని, ఆరో అం తస్తు అనుకుని ఐదో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డులోకి వెళ్లి ఖాళీగా ఉన్న బెడ్‌పై పడుకుని సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు.

ఆచూకీ కనిపెట్టారిలా..
ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఆరో అంతస్తు వార్డులో సదరు వ్యక్తి లేకపోవడం గుర్తించిన సిబ్బంది వైద్యాధికారులకు, పోలీసులకు తెలిపారు. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా లో చివరి కాల్‌ గాంధీ ఆస్పత్రి టవర్‌ లొకేషన్‌ చూపించడం, తర్వాత స్విచ్చాఫ్‌ కావడంతో పరారయ్యాడనే అంచనాకు వచ్చారు. ఒక పోలీస్‌ బృందం గద్వాల వెళ్లగా, మరి కొన్ని బృందాలు ఆస్పత్రి పరిసరాలను జల్లెడ పట్టాయి. సీసీ కెమెరాల ఫుటేజ్‌ పరి శీలించగా ఆస్పత్రి ప్రాంగణంలో అతడు తిరిగిన దాఖలాలు కనిపించలేదు. దీంతో ఆస్పత్రిలోనే ఎక్కడో ఉంటాడని భావించిన పోలీసులు, వైద్యసిబ్బంది అణువణువూ గాలించగా, ఐదో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డు బెడ్‌పై పడుకుని కనిపించాడు.

అన్ని అంతస్తులు, బెడ్‌లు ఒకేలా ఉండడంతో పొరబడి ఇక్కడే పడుకున్నానని అతడు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అనంతరం అతడిని ఆరో అంతస్తులోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మరోమారు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వైద్యాధికారుల ఆదేశాలతో నగరంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసీయూలో 138 మంది బాధితులకు, ఐసోలేషన్‌ వార్డుల్లో 350 మంది అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు