కరోనా.. కొత్త టెక్నాలజీలు!

28 Mar, 2020 04:44 IST|Sakshi

కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్న వివిధ సంస్థలు

ఎక్కడికైనా తరలించగలిగే ‘షిప్పింగ్‌’ ఐసీయూలు

కరోనా వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే ఎగిరే డ్రోన్లు

సాక్షి, హైదరాబాద్‌: నిరాశావాది ప్రతి అవకాశంలోనూ కష్టాలే చూస్తే..ఆశావాది ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడని అప్పుడెప్పుడో విన్‌స్టన్‌ చర్చిల్‌ చెప్పాడట..కరోనాతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంటే.. కొంతమంది ఇందులోనూ మానవాళికి మరింత మేలు చేసే కొత్త ఆవిష్కరణలకు అవకాశాలు వెతుకుతున్నారు. ఇప్పుడు కాకపోయినా..రాబోయే రోజుల్లో ఇలాంటి మహమ్మారి మానవాళిని కబళించే ప్రయత్నం చేస్తే ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయి ఈ ఆవిష్కరణలు.

షిప్పింగ్‌ కంటెయినర్లలో ఐసీయూలు! 
కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే వారం రోజుల్లో చైనా వెయ్యి పడకలతో కూడిన ఆసుపత్రిని హుటాహుటినా కట్టేసింది. అన్నిచోట్ల చైనా మాదిరి పరిస్థితులుండవు కదా.. అందుకే కనెక్టెడ్‌ యూనిట్స్‌ ఫర్‌ రెస్పిరేటరీ ఎయిల్‌మెం (కూరా) షిప్పింగ్‌ కంటెయినర్లనే ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ (ఐసీయూ)లుగా మార్చేసేంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తరలించేందుకు వీలైన ఈ ఐసీయూలు విపత్కర పరిస్థితుల్లో బోలెడన్ని ప్రాణాలు కాపాడతాయనడంలో సందేహం లేదు. కార్లో రాట్టీ అసోసియాటీ, ఇటాలో రోటా, స్టూడియో ఎఫ్‌ఎం మిలానో, హ్యుమానిటాస్‌ రీసెర్చ్‌ హాస్పిటల్, జాకబ్స్, స్క్వింట్‌ ఓపెరా తదితర సంస్థలన్నీ కలిసి ఈ వినూత్న ఐసీయూలను డిజైన్‌ చేసి తయారు చేస్తున్నాయి.

నౌకల్లో సరుకుల రవాణాకు ఉపయోగించే 20 అడుగుల పొడవైన కంటెయినర్లను బాగా శుభ్రం చేసి.. కిటికీలు, తలుపులు ఏర్పా టు చేస్తారు. వీటిని ఒకదానితో ఒకటి కలిపేందుకు బుడగల్లాంటి నిర్మాణాలను ఉపయోగిస్తారు. అవసరాన్ని బట్టి ఎక్కడికక్కడ గరిష్టంగా 40 పడకలతో కూడిన ఐసీయూ ఆసుపత్రిని సిద్ధం చేసుకోవచ్చన్నమాట. ఇవన్నీ ఎలా చేసుకోవాలన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి అవసరమైన వారెవరైనా ప్రపంచవ్యాప్తంగా వీటిని తయారు చేసుకోవచ్చు. వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ఈ కంటెయినర్లను నెగిటివ్‌ ప్రెషర్‌ తో కూడా రూపొందించవచ్చు. ఆçస్పత్రులకు అనుబంధంగా ఇలాంటి యూనిట్లను ఏర్పాటు చేసుకుంటే ఐసీయూల సా మర్థ్యాన్ని తక్కువ సమయంలో పెంచుకోవచ్చని అంచనా. క్షేత్రస్థాయి, తాత్కాలిక ఆçస్పత్రుల ఏర్పాటుకూ ఇవి ఉపయోగపడతాయి. ప్రస్తు తం కూరా తొలి నమూనా ఐసీయూను మిలాన్‌లోని ఓ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేస్తోంది.

డ్రోన్లతో కరోనా బాధితుల గుర్తింపు
భవిష్యత్తులో రోడ్లపై ఏదైనా ఓ డ్రోన్‌ కనిపించిందనుకోండి.. అదేదో ఫొటో లు తీసేందుకు వచ్చిందని అనుకోకండి. మీలో కరోనా లాంటి వైరస్‌ ఉందేమో గుర్తించేందుకు ఎగురుతూ ఉండొచ్చు. ఆశ్చర్యంగా ఉందా? సౌత్‌ ఆస్ట్రేలియా యూనివర్సిటీ, కెనడాలోని డ్రాగన్‌ఫ్లై డ్రోన్‌ కంపెనీ సంయుక్తంగా ఈ వినూత్నమైన డ్రోన్లను రూపొందిస్తున్నాయి. కరోనా వంటి మహమ్మారిని అడ్డుకునేందుకు వీలైనన్ని ఎక్కువ పరీక్షలు చేయాలన్నది తెలిసిందే. అయితే ఇందుకు బోలెడన్ని సమస్యలున్నాయి. ఇలా కాకుండా.. డ్రోన్ల ద్వారా సామూహికంగా ప్రజలందరినీ పరీక్షించగలిగితే వ్యాధి కట్టడి చాలా సులువవుతుంది.

ప్రత్యేకమైన సెన్సార్లు, కంప్యూటర్‌ చూపులు కలిగి ఉండే ఈ డ్రోన్లు గాల్లో ఎగురుతూనే వ్యాధితో బాధపడుతున్న వారిని గుర్తిస్తాయి. నిజానికి ఈ టెక్నాలజీని మూడేళ్ల క్రితమే ప్రొఫెసర్‌ జవాన్‌ చహల్‌ సిద్ధంచేశారు. భూమికి 33 అడుగుల ఎత్తులో ఎగురుతూ కూడా డ్రోన్‌ వీడియోల ద్వారా దగ్గు, తుమ్ములను గుర్తించగలవు. అంతేకాకుండా గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకునే వేగం వంటి వాటివన్నింటినీ గుర్తించగలదు. 50 మీటర్ల ప్రాంతంలోని ప్రజలపై నిఘా పెట్టగలదు. ప్రస్తుతానికి ఈ డ్రోన్ల కచ్చితత్వం కొంచెం తక్కువేనని, కాకపోతే ప్రాథమిక పరిశీలనలకు ఎంతో ఉపయోగపడుతుందని చహల్‌ అంటున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా