లష్కర్‌ను వీడుతున్న కరోనా!

18 May, 2020 09:16 IST|Sakshi
బౌద్ధనగర్‌కు బారికేడ్లు ఏర్పాటు చేసిన దృశ్యం

సికింద్రాబాద్‌ పరిధిలో తగ్గుతున్న కరోనా బాధితుల సంఖ్య

ఒక్కొక్కటిగా.. మొత్తం కంటైన్మెంట్‌ జోన్ల ఎత్తివేత

ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు

సాక్షి, సికింద్రాబాద్‌ : నిత్యం సందడిగా ఉండే సికింద్రాబాద్‌(లష్కర్‌) నగరం కరోనా పుణ్యమా.. అని 60 రోజులుగా మూగబోయింది. వ్యాపారాలు, కార్యాలయాలు మూతబడటం మాట అటుంచితే.. బయటకు వెళ్తే.. ఏమవుతుందోనన్న భయం మాత్రం ఈ ప్రాంత ప్రజలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెంటాడింది. లష్కర్‌లో 26 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో ముగ్గురు మృతి చెందారు. దీంతో లష్కర్‌ ప్రజలు పూర్తిగా భయాందోళనలకు గురయ్యారు. కరోనా దాడికి విలవిల్లాడిన లష్కర్‌ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కరోనా దెబ్బకు కంటైన్మెంట్‌ జోన్లుగా ఉన్న 13 కాలనీలలో కరోనా తగ్గుముఖంలో ఉండటంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తి వేస్తున్నారు. దీంతో నివాసాలకే పరిమితమైన కంటైన్మెంట్‌ ప్రాంతాల ప్రజలు కొంత మేరకు ఊపిరి పీల్చుకుంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్‌లోకి నటుడు)

13 కంటైన్మెంట్లు... 
సికింద్రాబాద్‌ నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ల పరిధిలో జీహెచ్‌ఎంసీ అధికారులు కరోనా విస్తృతిని కట్టడి చేసేందుకు 13 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలోని లాలాగూడ, మెట్టుగూడ, శ్రీనివాస్‌నగర్, షాబాద్‌గూడ, కౌసరి మసీదు, బౌద్ధనగర్‌ అను ఆరు కంటైన్మెంట్‌ జోన్లలో ఐదింటిని ఎత్తివేశారు. బేగంపేట్‌ సర్కిల్‌ పరిధిలోని జీరా, పాటిగడ్డ, ప్రకాశ్‌నగర్, రామస్వామి కాంపౌండ్, నల్లగుట్ట, ఈస్ట్‌ మారేడుపల్లి, పీజీ రోడ్‌ అను ఎనమిదికి ఎనమిది కంటైన్మెంట్‌ జోన్లన్నీంటిని ఎత్తేశారు. సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 14 మందికి, బేగంపేట్‌ సర్కిల్‌ పరిధిలో 12 మందికి కరోనా వైరస్‌ సోకడంతో వారితో సన్నిహితంగా ఉన్న రెండు సర్కిళ్ల పరిధిలో సుమారు నాలుగు వందల మందికి అధికారులు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే చికిత్స పొందుతుండగా మిగతా వారంతా డిశ్ఛార్జ్‌ అయ్యారు.  వైరస్‌ సోకిన వారిలో ముగ్గురు వ్యక్తులు మాత్రం మృతి చెందారు. (కనరో శ్రీవారి దర్శన భాగ్యము)

మిగిలింది ఒక్కటే... 
సికింద్రాబాద్, బేగంపేట్‌ సర్కిళ్ల పరిధిలోని 9 మున్సిపల్‌ డివిజన్లలో మొత్తంగా ఒక్క కాలనీ మాత్రమే కంటైన్మెంట్‌ జోన్‌గా కొనసాగుతుంది. ఇక్కడ ఏర్పాటు చేసిన 13 కంటైన్మెంట్లను అధికారులు రెండ్రోజుల క్రితమే ఎత్తివేశారు. తాజాగా బౌద్ధనగర్‌లోని ఒకే ఇంటిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రావడంతో అట్టి కాలనీని అధికారులు కంటైన్మెంట్‌ జోన్‌గా ఏర్పాటు చేశారు.  

నిరంతరం పరీక్షలు...
సికింద్రాబాద్‌ నగరంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు జీహెచ్‌ఎంసీ ఉత్తర మండలం అధికారులు అన్నివిధాల చర్యలు తీసుకుంటున్నారు. కంటైన్మెంట్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోని ప్రజలకు నిరంతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయా ప్రాంతాల్లో మందులు పిచికారీ చేయడం, పరిశుభ్రంగా ఉంచడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటించేందుకు, మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడడం పట్ల అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. (స్వతంత్ర దర్యాప్తు: భారత్‌ సహా 62 దేశాల మద్దతు!)

ముషీరాబాద్‌ : ముషీరాబాద్‌ నియోజకవర్గంలో కరోనా వైరస్‌ రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, పోలీసులు, యూపీహెచ్‌సీ సిబ్బంది సమన్వయంతో అనేక చర్యలు చేపడుతున్నారు. అయినా వైరస్‌ మాత్రం వ్యాపిస్తూనే ఉంది. శనివారం బాగ్‌లింగంపల్లిలోని ఈడబ్ల్యూఎస్‌ క్వార్టర్స్‌లో 34 సంవత్సరాల మహిళకు కరోనా సోకింది. 

ఆదివారం భోలక్‌పూర్‌ డివిజన్‌లో నివాసముండే గర్భిణీ (21)కి కరోనా సోకింది.  శనివారం వెన్నుపూస నొప్పి రావడంతో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన నేపథ్యంలో వైద్యులు నమూనాను సేకరించి కరోనా పరీక్షలకు పంపడంతో ఆమెకు పాజిటివ్‌ తేలింది. దీంతో  ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె నివాసమున్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఆమె ఉంటున్న ఇంటిలో 18 మంది సభ్యులు ఉన్నారు. ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ హేమలత వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారందరికీ కరోనా లక్షణాలు లేవని తెలిపారు.   ఇప్పటివరకు ముషీరాబాద్‌ నియోజకవర్గంలో మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10 మంది చికిత్స పొంది విజయవంతంగా కరోనాను జయించి ఇంటికి చేరుకున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు