కరోనా: ఇంటికే తాళం.. బస్తీ మొత్తానికి కాదు

5 May, 2020 08:16 IST|Sakshi
కిషన్‌బాగ్‌ కొండారెడ్డిగూడలో పరిస్థితిని పరిశీలిస్తున్న సర్కిల్‌–10 డీసీ జగన్‌ తదితరులు

మెరుగవుతున్న పాతబస్తీ 54 కంటైన్మెంట్ల తొలగింపు

ఇప్పటి వరకు 245 కరోనా పాజిటివ్‌ కేసులు

పూర్తిగా కోలుకున్న 85 మంది డిశ్చార్జి

ప్రస్తుతం 146 యాక్టివ్‌ కేసులు

ఇప్పటి వరకు 14 మంది మృతి

చార్మినార్‌లో కొత్తగా 5 పాజిటివ్‌ కేసులు

పాజిటివ్‌ వచ్చిన ఇంటికి తాళం వేస్తున్న అధికారులు

పాతబస్తీలో మూడు కొత్తగా హోం కంటైన్మెంట్లు  

కరోనా వైరస్‌ పంజా విసరడంతో పాతబస్తీ విలవిల్లాడింది.. గ్రేటర్‌ పరిధిలో ఎక్కువగా కేసులు పాతబస్తీలోనే నమోదు కావడంతో ఆ ప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి కాలనీల రహదారులను మూసేశారు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్‌కు తరలించారు. అన్ని చర్యలు చేపట్టడంతో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పటి వరకు పాతబస్తీలో 69 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా 54 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించారు. ప్రస్తుతం 15 మాత్రమేకొనసాగుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో కేవలం ఆ ఇంటికి తాళం వేసి హోం కంటైన్మెంట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం కిషన్‌బాగ్‌లో ఒకటి, యాకుత్‌పురాలో రెండు హోం కంటైన్మెంట్లు కొనసాగుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలో ఇప్పటి వరకు 54 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించారు. జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ పరిధిలోని సర్కిల్‌–6, 7, 8, 9, 10లలో 69 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు పరిస్థితులు మెరుగవుతుండటంతో అంచెలంచెలుగా జోన్లను తొలగిస్తున్నారు. మంగళవారం వరకు 54 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించారు. ప్రస్తుతం పాతబస్తీలో 15 మాత్రమే కొనసాగుతున్నాయి. వీటిలో కొన్నింటిని రెండు రోజుల్లో తొలగించనున్నారు. ఒకవైపు పాతబస్తీలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌తో వైద్య సేవలు పొంది ఆరోగ్యం మెరుగవడంతో గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతుండగా.. మరోవైపు కొత్త కేసులు నమోదవుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైనా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైతే.. గతంలో మాదిరిగా బస్తీ మొత్తం కంటైన్మెంట్‌ జోన్లుగా మార్చకుండా.. కేవలం ఆయా ఇంటికే తాళం వేసి కట్టడి చేస్తున్నారు.

దీన్ని హోం కంటైన్మెంట్‌ జోన్‌ అంటున్నారు. బహదూర్‌పురా నియోజకవర్గం పరిధి సర్కిల్‌–10లోని కిషన్‌బాగ్‌లో ఒకటి, యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలోని సర్కిల్‌–7లో రెండు కొత్తగా హోం కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. మలక్‌పేట్‌ సర్కిల్‌–6లో మొత్తం 17 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా.. ఇందులో మంగళవారం వరకు 13 తొలగించగా.. మరో 4 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నాయి. వీటిని కూడా బుధవారం తొలగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాతబస్తీలో 245 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇందులో 85 మంది ఇప్పటి వరకు ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు పొంది ఆరోగ్యం మెరుగుపడటంతో డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోన్‌ పరిధిలో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ప్రస్తుతం 146 మంది మాత్రమే కరోనా పాజిటివ్‌తో వైద్య సేవలు పొందుతున్నారు.

చార్మినార్‌లో కొత్తగా మూడు..
చార్మినార్‌లో మొత్తం 10 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా.. 7 జోన్లను తొలగించగా.. శనివారం కొత్తగా మరో 5 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మళ్లీ కొత్తగా 3 కంటైన్మెంట్‌ జోన్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చార్మినార్‌లో మూడు పాతవి.. 3 కొత్తవి ఉన్నాయి. చార్మినార్‌ నియోజకవర్గం పరిధిలోని చార్మినార్‌ సర్కిల్‌–9లో శనివారం కొత్తగా 5 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒకే ఇంట్లో ముగ్గురు కాగా, ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. దీంతో చార్మినార్‌ సర్కిల్‌ పరిధిలో ప్రస్తుతం 14 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక్కడ 22 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, ఇందులో ఇద్దరు చనిపోయారు. ఆరుగురికి ఆరోగ్యం మెరుగు పడటంతో డిశ్జార్జీ అయ్యారు.  

యాకుత్‌పురాలో హోం కంటైన్మెంట్‌
యాకుత్‌పురా నియోజకవర్గం పరిధిలోని సంతోష్‌నగర్‌ సర్కిల్‌–7లోని 16 కంటైన్మెంట్‌ జోన్లను పూర్తిగా తొలగించినట్లు సంబంధిత సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ అలీవేలు మంగ తాయారు తెలిపారు. డబీర్‌పురాలో ఒక హోం కంటైన్మెంట్‌ జోన్‌ కొనసాగుతుందన్నారు. యాకుత్‌పురాలో ఒక వృద్ధుడు గుండెనొప్పితో మృతి చెందాడని, అతడి ఇంటిని కూడా హోం కంటైన్మెంట్‌ చేయనున్నామన్నారు.  

చాంద్రాయణగుట్టలో పూర్తిగా తొలగింపు
చాంద్రాయణగుట్ట సర్కిల్‌–8లోని 10 కంటైన్మెంట్‌ జోన్లను తొలగించారు. ఈ సర్కిల్‌లో 35 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఇద్దరు చనిపోయారు. 25 మంది గాంధీ నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 8 మంది వైద్య సేవలు పొందుతున్నారని డిప్యూటీ కమిషనర్‌ షెర్లీ పుష్యరాగం తెలిపారు.  

బహదూర్‌పురాలో  కొత్తగా హోం కంటైన్మెంట్‌..
బహదూర్‌పురా నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఫలక్‌నుమా సర్కిల్‌–10లో 13 కంటైన్మెంట్‌ జోన్లు ఉండగా.. మంగళవారం వరకు 9 జోన్లను తొలగించగా.. ప్రస్తుతం 4 మాత్రమే ఉన్నాయి. ఇందులో కొన్నింటిని బుధవారం తొలగించనున్నారు. ప్రస్తుతం 40 మంది కరోనా పాజిటివ్‌తో వైద్య సేవలు పొందుతున్నారని డీసీ జగన్‌ తెలిపారు. కిషన్‌బాగ్‌లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో హోం కంటైన్మెంట్‌ చేశామన్నారు.

నేరేడ్‌మెట్‌లో జోన్‌ ఎత్తివేత
నేరేడ్‌మెట్‌: నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని శ్రీకాలనీ కంటెన్మెంట్‌ జోన్‌ను ఎత్తివేసినట్లు మల్కాజిగిరి డీసీ దశరథ్‌ సోమవారం పేర్కొన్నారు. గత నెల 16న ఓ వృద్ధుడికి పాజిటివ్‌ రావడంతో ఈ కాలనీని అధికారులు కంటెన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మళ్లీ పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోవడంతో కంటెన్మెంట్‌ జోన్‌ను ఎత్తివేశామని డీసీ వివరించారు.  

జింకలబావి కాలనీలో రెండు పాజిటివ్‌
హుడాకాంప్లెక్స్‌: సరూర్‌నగర్‌ సర్కిల్‌ పరిధి జింకలబావి కాలనీలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో అధికారులు జింకలబావి కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. భద్రతా చర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం తెలిపారు.

పాతబస్తీలో పరిస్థితి మెరుగవుతోంది..
పాతబస్తీలో పరిస్థితి మెరుగవుతోంది. కొత్త కేసుల నమోదు తగ్గింది. పాతబస్తీలో దాదాపు అన్ని సర్కిల్స్‌ పరిధిలో కంటైన్మెంట్‌ క్లస్టర్స్‌ తొలగించాం. చార్మినార్‌ జోన్‌ పరిధిలో ఇప్పటి వరకు 245 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చనిపోయిన వారు కాకుండా మిగతా వారంతా ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఇందులో ఇప్పటి వరకు 85 మంది పాజిటివ్‌ పేషంట్స్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం హోం కంటైన్మెంట్‌ చేస్తున్నాం.        
– ఎన్‌.సామ్రాట్‌ అశోక్, జీహెచ్‌ఎంసీ చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌  

రామ్‌కోఠిలోమొదటిసారి 
సుల్తాన్‌బజార్‌: సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వృద్ధుడు కరోనా పాజిటివ్‌తో మృతి చెందడంతో మొదటి సారిగా కంటైన్మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేశారు. చనిపోయిన వృద్ధుడి కుటుంబం ఇంటికి తాళం వేసి నిత్యావసర సరుకులను పోలీసులు అందజేస్తున్నారు.  

చీర్యాలలో ఎత్తివేత
కీసర: చీర్యాల గ్రామంలో కంటైన్మెంట్‌ జోన్‌ను ఎత్తివేసినట్లు కీసర ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ తెలిపారు. గతనెల 18న ఓ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో గ్రామాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన విషయం విధితమే.. సోమవారం ఆ కంటైన్మెంట్‌ను అధికారులు ఎత్తివేశారు.  

హోం కంటైన్మెంట్‌గా కానిస్టేబుల్‌ ఇల్లు
అంబర్‌పేట: కరోనా పాజిటివ్‌ వచ్చిన నివాసాన్ని అధికారులు కంటైన్మెంట్‌ చేశారు. అంబర్‌పేట డివిజన్‌ చెన్నారెడ్డినగర్‌లో నివాసముండే కానిస్టేబుల్‌ నివాసాన్ని శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులు కంటైన్మెంట్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు