మరో తొమ్మిది కరోనా అనుమానిత కేసులు

9 Feb, 2020 03:01 IST|Sakshi

ఇప్పటి వరకు 70 మందికి కరోనా పరీక్షలు

62 మందికి నెగటివ్‌.. 8 మందికి ఇంకా రావాల్సిన నివేదికలు

గాంధీ ఆస్పత్రి : కరోనా అనుమానిత కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా శనివారం 9 అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు 70 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, 62 కేసుల్లో నెగటివ్‌ వచ్చింది. మరో 8 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. కాగా, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి శనివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. అనుమానిత రోగుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గాంధీలో 10 పడకల సామర్థ్యంతో అదనంగా మరో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎంఈ చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, కరోనా వైరస్‌పై సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు.

5 స్వైన్‌ఫ్లూ కేసులు..
స్వైన్‌ఫ్లూ మహమ్మారి చాపకింది నీరులా విస్తరిస్తోంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో శనివారం కొత్తగా 5 స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీకి చెం దిన ఓ వృద్ధురాలు (64), నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామానికి చెందిన వృద్ధుడు(60), చాంద్రాయణగుట్టకు చెందిన వృద్ధురాలు(68), మహబూబ్‌నగర్‌ జిల్లా హేండ్‌వాడకు చెందిన వ్యక్తి (35), ఫతేనగర్‌కు చెందిన నెలన్నర వయసు గల పాపకు స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌ వచ్చింది. మరో ముగ్గురు స్వైన్‌ఫ్లూ అనుమానితులకు గాంధీ ఆస్పత్రి డిజాస్టర్, పీఐసీయులో అడ్మిట్‌ చేసి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు గాంధీలో 10 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా.. వీరిలో ఐదుగురిని సురక్షితంగా డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.
   

మరిన్ని వార్తలు