బోనాల పండగొస్తోంది

15 May, 2020 08:10 IST|Sakshi

ఈసారి గత వైభవం ఉండకపోవచ్చు

పండగకు తప్పని కరోనా తిప్పలు

సాదాసీదాగా జరగనున్న ఆషాఢ బోనాలు

నిరాడంబరంగా వేడుకలకు సిద్ధమవుతున్న నిర్వాహకులు

జూన్‌ 25 నుంచి ఉత్సవాలు ప్రారంభం

చార్మినార్‌: ఆషాఢ మాసం బోనాల జాతర రానున్నది. ఈసారి వచ్చేనెలలో జరగనున్న బోనాల పండగకు కరోనా ఎఫెక్ట్‌ తగలనుంది. తెలంగాణలోనే అత్యంత వైభవంగా నిర్వహించే ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల్లో పాతబస్తీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ ఏర్పడిన అనంతరం బోనాల జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండగగా ప్రకటించి తగిన ఏర్పాట్లు చేస్తోంది. పాతబస్తీ వీధుల్లో నిర్వహించే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు రోజు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. నగరంలోని భక్తులే కాకుండా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తారు. ఈ ఘటాల ఊరేగింపులో కళాకారుల నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈసారి ఇవేవీ ఉండకపోవచ్చునని నిర్వాహకులు భావిస్తున్నారు. ఎందుకంటే... కళాకారుల నృత్య ప్రదర్శనల కోసం రెండు నెలలు ముందుగానే ఆర్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఎవరు కూడా ఇప్పటి వరకు కళాకారులకు ఆర్డర్లు ఇవ్వలేదు. దీంతో ఈసారి కళాకారుల నృత్య ప్రదర్శనలు ఉండవని           అంటున్నారు.   

కోవిడ్‌ వైరస్‌ ప్రభావంతో...
ఈసారి ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల వరకు కూడా కోవిడ్‌–19 వైరస్‌ ప్రభావం తగ్గకపోతే.. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఉత్సవాలను నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామంటున్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ సడలిస్తే.. గుంపులుగా కాకుండా భౌతిక దూరం పాటిస్తూ బ్యాండ్, మేళాలు, కళాకారుల నృత్యాలు, డీజేలు లేకుండా ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. నాలుగైదు రోజులుగా శ్రీ భాగ్యనగర్‌ బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి ఆయన సలహాలు, సూచనల మేరకు కార్యాచరణను రూపొందించుకుంటామంటున్నారు.  

జూన్‌ 25న గోల్కొండ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం
జూన్‌ 25వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. జూలై 5న విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లికి, 12న సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి... అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘటస్థాపన ఊరేగింపు, 19న పాతబస్తీతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి.  

ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడిగా జే.మధుసూదన్‌ గౌడ్‌
శ్రీ భాగ్యనగర్‌ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నూతన అధ్యక్షుడిగా జే.మధుసూదన్‌ గౌడ్‌ నియమితులయ్యారు. ఈ ఏడాది జరిగే బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మీరాలంమండిలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గతేడాది బాధ్యతలు నిర్వహించిన పొటేల్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ నుంచి ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఉప్పుగూడ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ ప్రతినిధులు గాజుల అంజయ్య, రాకేశ్‌ తివారి, తిరుపతి నర్సింగ్‌ రావు, మల్లేష్‌ గౌడ్, ఆలే భాస్కర్‌ రాజ్, పొటేల్‌ సదానంద్‌ యాదవ్, ప్యారసాని వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు