బంపర్‌ ఆఫర్లు.. ఐనా నో ఇంట్రెస్ట్

27 Feb, 2020 09:02 IST|Sakshi

సింగపూర్, బ్యాంకాక్, మలేషియా టూర్లకు బంపర్‌ ఆఫర్లు

బ్యాంకాక్, సింగపూర్‌  రూ.20 వేలు, మలేషియా రూ.23 వేలు

కరోనా భయంతో తగ్గిన విదేశీ ప్రయాణాలు

ఈ మూడు దేశాలకు ప్యాకేజీలను విరమించుకున్న ఐఆర్‌సీటీసీ

సాక్షి, సిటీబ్యూరో:  రూ.20 వేలుంటే చాలు ఎంచక్కా  ఏ బ్యాంకాకో, సింగపూర్‌కో ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. హాయిగా ఆ దేశాల్లో విహరించి  తిరిగి  సిటీకి వచ్చేయొచ్చు. విదేశాలకు  వెళ్లాలంటే ఇప్పుడు  రూ.లక్షలు  ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి  మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు  కొద్దిపాటు చార్జీలతోనే  వెళ్లిరావచ్చు. అంతేకాదు, కొన్ని  ఎయిర్‌లెన్స్‌  ప్రయాణికులు చెల్లించిన చార్జీలపైన క్యాష్‌బ్యాక్‌  ఆఫర్లను  కూడా ప్రకటిస్తున్నాయి. పర్యాటకులను ఆకట్టుకొనేందుకు, విదేశీటూర్లకు తీసుకెళ్లేందుకు ట్రావెల్‌ ఏజెన్సీలు  పడిగాపులు కాస్తున్నాయి. కానీ  హైదరాబాద్‌ నగర పర్యాటకులు మాత్రం ముందుకు రావడం లేదు. ఆ మూడు దేశాలకు వెళ్లేందుకు ‘బాబోయ్‌  మేం రాబోమంటూ’  వెనుకడుగు  వేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ టూరిస్టు సంస్థలు సైతం ప్యాకేజీలను  విరమించుకుంటున్నాయి.

గత రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న  కరోనా వైరస్‌ ప్రభావంతో  హైదరాబాద్‌ నుంచి విదేశీ  ప్రయాణాలు  తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్‌లకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోగా  పర్యాటకులు ఎక్కువగా  వెళ్లే  మలేసియా, సింగపూర్, బ్యాంకాక్‌లకు  మాత్రం  చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాల దృష్ట్యా  తప్పనిసరిగా వెళ్లవలసిన  ప్రయాణికులు మినహా సాధారణ  సందర్శకులు మాత్రం  ససేమిరా  అంటున్నారు. దీంతో  హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి  సాధారణంగా ప్రతి రోజు  సుమారు 10 వేల మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య  6000 నుంచి  7000 వరకు పడిపోయినట్లు  అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. 

చార్జీలు  తగ్గుముఖం
హైదరాబాద్‌ నుంచి పర్యాటకులు ఎక్కువగా వెళ్లే  బ్యాంకాక్‌కు రాను, పోను చార్జీలు కలిపి  గతంలో రూ.26000 నుంచి రూ.30,000 వరకు ఉంటే  ఇప్పుడు  సుమారు రూ.20 వేలయింది. ఒకప్పుడు  హైదరాబాద్‌ నుంచి  గోవాకు వెళ్లే  పర్యాటకులు ఇప్పుడు  బ్యాంకాక్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. పర్యాటక ప్రదేశాలు, అందమైన గార్డెన్‌లతో పాటు వినోదానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే  బ్యాంకాక్‌కు  ఎక్కువ సంఖ్యలో వెళ్తారు. కానీ  రెండు నెలల క్రితం  చైనాలో  మొదలైన కరోనా క్రమంగా పలు దేశాలకు విస్తరించడం, ప్రత్యేకించి  ఎక్కువ దేశాల నుంచి పర్యాటకులు  వచ్చే బ్యాంకాక్‌కు  ప్రమాదం పొంచి ఉండడంతో నగరవాసులు  బ్యాంకాక్‌ టూర్‌ను రద్దు చేసుకుంటున్నారు. ఉన్నపళంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో  థాయ్‌ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌ ఏసియా వంటి  విమాన సంస్థలు చార్జీలను బాగా తగ్గించాయి.

అంతేకాకుండా క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో ఆకట్టుకొనేందుకు  ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బ్యాంకాక్‌తో పాటు  ఎక్కువ మంది  సింగపూర్, మలేసియాకు సైతం వెళ్తారు. అందమైన సింగపూర్‌ను  తిలకించడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. ఇప్పుడు  ఈ  రెండు  దేశాలకు కూడా  ప్రయాణాలు  చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎయిర్‌లైన్స్‌ చార్జీలను   తగ్గించాయి. సింగపూర్‌కు సైతం హైదరాబాద్‌ నుంచి వెళ్లి, తిరిగి చేరుకొనేందుకు ప్రస్తుత చార్జీ  రూ.20 వేలే కావడం గమనార్హం. ప్రయాణీకుల రద్దీ, డిమాండ్‌  భారీగా ఉండే రోజుల్లో మలేషియా ట్రిప్పు  రూ.35 వేల నుంచి  రూ.50 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.23 వేలకు తగ్గిపోయింది. అయినప్పటికీ నగరవాసులు అటు వైపు  వెళ్లేందుకు సాహసించడం లేదు.  

వేచిచూస్తున్నారు..

‘విదేశాలకు వెళ్లేందుకు ఎవరైనా ఆ సక్తి చూపుతారు. కానీ ఇప్పుడు చా లా మంది వేచి చూసే  ధోరణిలో ఉన్నారు. కరోనా భయం ప్రతి  ఒక్కరిని వెంటాడుతోంది. దీంతో  ప్యాకేజీలను  ఏర్పాటు చేయలేకపోతున్నాం.’ అని  ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్‌ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు  తెలిపారు. కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోవలసి వస్తున్నప్పటికీ  టూరిస్టుల విముఖత కారణంగా ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించలేకపోతున్నట్లు  పేర్కొన్నారు. ‘‘ఏడాదికి ఒకసారి  బ్యాంకాక్‌కు వెళ్లడం అలవాటు.కానీ ఇప్పుడు ఆ  దేశానికి వెళ్లాలంటే  భయమేస్తుంది. ఎందుకంటే  ఒకవైపు చైనాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ  ఆ దేశానికి చెందిన టూరిస్టులపైన  థాయ్‌లాండ్‌æ  ఎలాంటి నిషేధం విధించలేదు. దీంతో ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు  వెళ్లేందుకు సాహసించడం లేదు.’’ అని రమేష్‌  అనే పర్యాటకుడు  తెలిపారు.

ప్యాకేజీలు విరమించుకున్న ఐఆర్‌సీటీసీ

హైదరాబాద్‌ నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్‌లకు  క్రమం తప్పకుండా ప్యాకేజీలను  ప్రకటించే  ఐఆర్‌సీటీసీ  ఈ సారి ఎలాంటి  ప్యాకేజీలను  విడుదల చేయలేదు. సమ్మర్‌ టూర్‌లను వాయిదా వేసుకుంది. ఈ మూడు దేశాలకు బదులు త్వరలో యురోప్‌ టూర్‌ను  ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు  ఐఆర్‌సీటీసీ డిఫ్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య  తెలిపారు.

మరిన్ని వార్తలు