ర్యాపిడ్‌ టెస్టులకు ఓకే

3 Jul, 2020 02:14 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం...

యాంటీజెన్‌ టెస్టులతో 15 నిమిషాల్లో కరోనా నిర్ధారణ 

మొదటి విడతగా 50 వేల పరీక్షలకు కసరత్తు

ఐసీఎంఆర్‌ అనుమతి... 2, 3 రోజుల్లో కిట్లు

పాజిటివ్‌ వస్తే సరి... నెగెటివ్‌ వస్తే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి

తొలుత జీహెచ్‌ఎంసీ సహా వైరస్‌ ప్రభావిత జిల్లాల్లో టెస్టులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టులను కూడా అంతే వేగంగా నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్‌ ఉందో లేదో నిర్ధారించే యాంటీజెన్‌ పరీక్షను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌ టెస్ట్‌ ద్వారా గరిష్టంగా అర గంటలో ఫలితం తెలుస్తుంది. ఈ మేరకు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ నుంచి కిట్లు రాష్ట్రానికి రానున్నాయి. అనంతరం వాటిని ఉపయోగించి వైద్య సిబ్బంది విరివిగా పరీక్షలు చేయనున్నారు. వైరస్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తారు. అప్పటికప్పుడే ఫలితం ప్రకటిస్తారు.

పాజిటివ్‌ వచ్చిన వారిని తక్షణమే హోం ఐసోలేషన్‌ లేదా అవసరాన్ని బట్టి ఆసుపత్రికి తరలిస్తారు. ముందుగా 50 వేల కిట్లు తెప్పించి పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రైవేటు లేబొరేటరీలకు కూడా యాంటీజెన్‌ టెస్టులకు అనుమతి ఇస్తారు. తద్వారా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షకు ప్రైవేటు లేబొరేటరీల్లో రూ. 2,200 వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ పరిధిలోనూ అదే స్థాయిలో ఖర్చు అవుతుంది. కానీ యాంటీజెన్‌ పరీక్షకు మాత్రం రూ. 500 మాత్రమే ఖర్చు కానుంది. ముందుగా జీహెచ్‌ఎంసీ సహా వివిధ జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో యాంటీజెన్‌ పరీక్షలు చేస్తారు. 
నమూనాలు సేకరించిన గంటలో పరీక్ష చేయాల్సిందే...రాష్ట్రంలో కరోనా వైరస్‌ నమూనాలు సామర్థ్యానికి మించి వస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు లేబొరేటరీలపై తీవ్ర భారం పడుతోంది. దీంతో శాంపిళ్లు ఇచ్చిన తర్వాత ఒక్కోసారి 4–5 రోజుల వరకు కూడా ఫలితం రావడంలేదు. దీంతో తీవ్రమైన లక్షణాలున్న వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నారు.

ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష చేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఎక్కువ శాంపిళ్లు పేరుకుపోవడం, శాంపిళ్ల సేకరణ అనంతరం వాటిని లేబొరేటరీకి తరలించడం వల్ల సమయం వృథా అవుతోంది. దీంతో పరీక్షల నిర్వహణపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం యాంటీజెన్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో కరోనా నిర్ధారణ కోసం ఆర్‌టీ–పీసీఆర్, ట్రూనాట్, సీబీనాట్‌లను ఉపయోగిస్తున్నారు. వీటన్నింటికీ పరికరాలు, జీవ భద్రత, బయో సెక్యూరిటీపరంగా ప్రత్యేకమైన లేబొరేటరీల్లో సౌకర్యాలు అవసరం. నమూనాల సేకరణ, తదనంతరం వాటి రవాణాకు ఆయా ప్రాంతాలను బట్టి కనీసం రెండు నుంచి ఐదు గంటల వరకు పడుతుంది. దీంతో ఎక్కువ పరీక్షలు చేయడానికి ఇవి ఆటంకంగా మారుతున్నాయి. అందుకే యాంటీజెన్‌ పరీక్షలపై సర్కారు దృష్టి సారించింది. పైగా యాంటీజెన్‌ పరీక్షకు నమూనా సేకరించిన తర్వాత తప్పనిసరిగా గంటలోనే పరీక్ష చేయాలి. లేకుంటే నమూనా వృథా అయిపోతుంది. లేబొరేటరీలకు నమూనాలను రవాణా చేసే పరిస్థితి ఉండదు. అందువల్ల శాంపిళ్లు సేకరించిన ఆరోగ్య కేంద్రంలోనే అప్పటికప్పడు పరీక్షలు నిర్వహించాలి. దీనికోసం ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. సాధారణ లేబొరేటరీ సౌకర్యం ఉంటే చాలు. 

నెగెటివ్‌ వస్తే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి...
కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ డిటెక్షన్‌ పరీక్ష కీలకమైంది. కరోనా పాజిటివ్‌ రోగులను వేగంగా గుర్తించడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. వేగంగా పరీక్షించడానికి, ట్రాక్‌ చేయడానికి, చికిత్స చేయడానికి దీనివల్ల వీలు కలుగుతుంది. ఈ పరీక్ష కచ్చితత్వం 99.3 నుంచి 100 శాతం ఉంటుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. అయితే ఈ పరీక్షకు ఉన్న ప్రధాన లోపం ఏమిటంటే అనుమానిత వ్యక్తి నమూనాలను పరీక్షించాక ఫలితం పాజిటివ్‌ వస్తే పాజిటివ్‌గానే పరిగణిస్తారు. కానీ ఒకవేళ నెగెటివ్‌ వస్తే మాత్రం ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో మరోసారి పరీక్ష చేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఐసీఎంఆర్‌ తెలిపింది. అయితే తీవ్ర లక్షణాలున్న వారికి, కేసులు అధికంగా నమోదవుతున్న చోట యాంటీజెన్‌ టెస్టులు మరింత ఉపయోగపడతాయని ఐసీఎంఆర్‌ తెలిపింది.

కంటైన్మెంట్‌ జోన్లు, తీవ్ర వైరస్‌ లక్షణాలున్న వారు, ఊపిరితిత్తుల వ్యాధి, గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, మూత్రపిండాల వ్యాధి, మధుమేహం, నాడీ సంబంధిత రుగ్మతలు తదితర అనారోగ్య లక్షణాలున్న వారికి ఈ యాంటీజెన్‌ పరీక్షల వల్ల వేగంగా కరోనా వైరస్‌ నిర్ధారణ చేయడానికి వీలు కలుగుతుంది. 65 ఏళ్లు పైబడినవారు, తీవ్ర శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వారు, 100.4 డిగ్రీలకు పైబడి జ్వరం, దగ్గుతో తీవ్ర శ్వాసకోశ సంక్రమణ వ్యాధులు ఉన్నవారికి దీనిద్వారా పరీక్షించాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు