జలుబు, దగ్గు, జ్వరం లేకుంటే ఇంటికే..

14 May, 2020 02:47 IST|Sakshi

డిశ్చార్జ్‌కు మూడ్రోజుల ముందు పై లక్షణాలు లేకుంటే పరీక్షలుండవ్‌..

అనంతరం 14 రోజులు ఇంట్లోనే హోం క్వారంటైన్‌

కొత్త మార్గదర్శకాల మేరకు గాంధీ నుంచి 117 మంది డిశ్చార్జ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: డిశ్చార్జ్‌కు ముందు వరుసగా మూడ్రోజుల పాటు ఎలాంటి మందులు వాడకున్నా.. జలుబు, దగ్గు, జ్వరం లేకుంటే చాలు, ఇకపై వారికి ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయకుండానే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తారు. కరోనా వైరస్‌ స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతూ 14 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 117 మందిని బుధవారం డిశ్చార్జి చేశారు. వీరిలో పురుషులు 63, మహిళలు 43, పద్నాలుగేళ్ల లోపు పిల్లలు 11 మంది ఉన్నారు. వీరంతా 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి.

ఎప్పటికప్పుడు ఆరోగ్య సమాచారాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు తెలపాలి. ఐసీఎంఆర్‌ తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఇకపై కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారికి 14 రోజులే చికిత్స అందిస్తారు. ఈ ప్రకారం 117 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్టు గుర్తించి, బుధవారం డిశ్చార్జ్‌ చేసినట్టు వైద్యులు చెప్పారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ, అవయవ మార్పిడి బాధితులు, ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు, ఇతర సీరియస్‌ కేసుల్లో మాత్రం డిశ్చార్జి తీరు వారు కోలుకునే దానిపై ఆధారపడి ఉంటాయి.  పరీక్షలు చేశాకే ఇంటికి పంపిస్తారు. 

ఇంట్లో ఐసోలేషన్‌ తప్పనిసరి.. 
కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్వల్ప లక్షణాలుండి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి.. డిశ్చార్జ్‌కు 3 రోజుల ముందు మాత్రలు వాడకపోయినా జ్వరం ఉండకూడదు. ఆక్సిజన్‌ స్థాయి సరిపడా ఉండాలి. ఇబ్బందిలేకుండా ఊపిరి తీసుకోగలగాలి. ఆ వ్యక్తికి లక్షణాలు మొదలై 10 రోజులు పూర్తయి ఉండాలి. ఈ స్థితుల్లో పరీక్షలు నిర్వహించకుండానే డిశ్చార్జ్‌ చేస్తారు. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఇంట్లో ఎవరినీ తాకకూడదు. నేరుగా మాట్లాడకూడదు. ఒకవేళ ఇంటికి వెళ్లాక ఆక్సిజన్‌ స్థాయి 95% కంటే తక్కువైతే తక్షణమే కరోనా ఆసుపత్రికి తరలించాలి. డిశ్చార్జి తర్వాత రోగిలో జ్వరం, దగ్గు, శ్వాస కు ఇ బ్బంది ఎదురైతే హెల్ప్‌లైన్ల ద్వారా సంప్రదించాలి. 14వ రోజున అతని ఆరోగ్య స్థితిని టెలీకాన్ఫరెన్స్‌లో వైద్య సిబ్బంది ఆరా తీస్తారు. సమస్యలుంటే మళ్లీ ఆస్పత్రిలో చేర్చుకుని పూర్తిగా నయమయ్యే వరకు చికిత్స అందిస్తారు.  

>
మరిన్ని వార్తలు