ఒకేరోజు 14 మందికి కరోనా పాజిటివ్‌

28 Mar, 2020 02:04 IST|Sakshi

రాష్ట్రంలో 59కి చేరిన కరోనా కేసులు

‘హైదరాబాద్‌ వైద్యుడి’ తల్లికి సోకినట్లు నిర్ధారణ

అమెరికా నుంచి వచ్చిన వృద్ధుడికీ పాజిటివ్‌

మిగతా వివరాలపై బులెటిన్‌ విడుదల చేయని ప్రభుత్వం  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య ఇండోనేసియాకు చెందిన ఏడుగురికి, మరో వ్యక్తికి మొత్తం కలిపి 8 మందికి ఒకేరోజు పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఈసారి 14 నమోదు కావడం రాష్ట్రంలో సంచలనమైంది. దీంతో తెలంగాణలో కరోనా రోగుల సంఖ్య 59కి చేరింది. ఇందులో గడిచిన వారం రోజుల్లోనే 40 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే శుక్రవారం వైరస్‌ పాజిటివ్‌ వచ్చిన వారి వివరాలపై వైద్య,ఆరోగ్యశాఖ ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయలేదు. ఇప్పటివరకు ప్రతిరోజూ రెండు సార్లు, ఒక్కోసారి మూడోసారి కూడా బులెటిన్‌ విడుదల చేసేవారు. ఎందుకో ఏమో కానీ, మొదటిసారి బులెటిన్‌ విడుదల చేయలేదు. దీనికి గల కారణాలను కూడా వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెప్పడం లేదు.

ఈ 14 కేసుల్లో విదేశాల నుంచి వచ్చినవారు ఎందరు, లోకల్‌గా వైరస్‌ అంటించుకున్న వారు ఎందరన్న దానిపై వివరాలు బయటకు రావడం లేదు. అయితే నమోదైన 14 కేసుల్లో రెండింటి వివరాలు తెలిశాయి. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌కు తన ద్వారా భార్యకు ఇప్పటికే పాజిటివ్‌ రాగా, ఇప్పుడు ఆ డాక్టర్‌ తల్లికి కూడా వైరస్‌ వ్యాపించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. గురువారం చేసిన పరీక్షల్లో ఆమెకు నెగెటివ్‌ రాగా, శుక్రవారం పాజిటివ్‌ రావడం గమనార్హం. ఇంకోటి అమెరికా నుంచి వచ్చిన 76 ఏళ్ల వృద్ధుడికి కూడా వైరస్‌ సోకినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మిగిలిన కేసుల వివరాలపై అందరిలోనూ ఆందోళన నెలకొంది. (అన్నింటికి సంసిద్ధంగా ఉన్నాం)    

బీబీనగర్‌ ఎయిమ్స్‌లోనూ ఐసోలేషన్‌ పడకలు
ఇటు ఇప్పటికే అనేక ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆసుపత్రుల్లో కరోనా ఐసోలేషన్‌ పడకల ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం, తాజాగా బీబీనగర్‌లో ఉన్న ఎయిమ్స్‌లోనూ కరోనా ఐసోలేషన్‌ పడకలను, వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎన్ని పడకలనే వివరాలపై స్పష్టత రాలేదు. 

మరిన్ని వార్తలు