నిజామాబాద్‌ ఆస్పత్రిలో కలకలం

11 Jul, 2020 03:53 IST|Sakshi

కరోనా కాటుకు ముగ్గురు మృతి

అప్పుడే చికిత్స కోసం వచ్చిన మరొకరు కూడా.. 

ఆక్సిజన్‌ సరఫరాలో లోపమంటూ మృతుల బంధువుల ఆందోళన 

ఆక్సిజన్‌ లోపం కాదు: కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో గురువారం రాత్రి నలుగురు రోగులు మృతి చెందడం కలకలం రేగింది. వీరిలో కరోనా కాటుకు ముగ్గురు, అనారోగ్యంతో అప్పుడే చికిత్స కోసం వచ్చిన మరొకరు మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్‌ అందకపోవడంతోనే ముగ్గురు మృతి చెందారని, వారి బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. జిల్లాలోని ముగ్గురు వ్యక్తులు కరోనా వైరస్‌ సోకడంతో ఇటీవల జనరల్‌ ఆస్పత్రిలో చేరారు. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయం లో ఎడపల్లికి చెందిన మహిళ (65), జక్రాన్‌పల్లికి చెందిన మహిళ (75), భీమ్‌గల్‌కు చెందిన వ్యక్తి (55) పరిస్థితి విషమించి చనిపోయారు. ఇదే సమయంలో నందిపేట నుంచి మరో రోగి పక్షవాతం సమస్యతో ఆస్పత్రికి వచ్చాడు. దగ్గు, దమ్ము ఉండటంతో కోవిడ్‌ లక్షణాలు ఉన్నాయని భావించిన వైద్యులు.. చికిత్స చేసేందుకు ఉపక్రమించేలోపే అతనూ ప్రాణాలొదిలాడు. గంటల వ్యవధిలోనే నలుగురు మృతి చెందడంతో ఆస్పత్రిలో కలకలం రేగింది.

కాగా, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడంతోనే ముగ్గురు మృతి చెందారని వారు బంధువులు ఆందోళనకు దిగారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఐసీయూలో సాంకేతిక సమస్య ఏర్పడి ఆక్సిజన్‌ సరఫరా శాతం తగ్గిపోయిందని, వైద్యసిబ్బంది ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించడానికి మూడు గంటల పాటు ఆలస్యం కావడంతో ముగ్గురు మృతి చెందారని వారు ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆస్పత్రి ఎదుట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

ఆక్సిజన్‌ లోపం కాదు: కలెక్టర్‌ 
జనరల్‌ ఆస్పత్రిలో ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందిన ఘటనలో ఆక్సిజన్‌ సరఫరా లోపం ఏమీ లేదని కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్పష్ట చేశారు. మృతుల బంధువులు చేస్తున్న ఆరోపణ ల్లో వాస్తవం లేదన్నారు. ఆస్పత్రిలో రోగులకు మె రుగైన వైద్య సేవలు అందుతున్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెంది న ముగ్గురికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయని, పరిస్థితి విషమించి చనిపోయారని ఆస్పత్రి సూప రింటెండెంట్‌ నాగేశ్వర్‌రావు వివరణ ఇచ్చారు.   

మరిన్ని వార్తలు